Tarak Ratna Health Update : హీరో నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.  తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందంతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు వచ్చింది.  బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్న హెల్త్ కండిషన్ పై మెడికల్ రిపోర్టు విడుదల చేశారు.  ఇందులో అత్యంత విషమ పరిస్థితుల్లో తారకరత్న ఆరోగ్యం ఉందని వెల్లడించారు.  ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ మీద బెలూన్ యాంజియో ప్లాస్టిక్ విధానంలో రక్త ప్రసరణ మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. బాలకృష్ణ ఆసుపత్రిలో ఉంటూ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు ఆసుపత్రికి రానున్నట్లు తెలుస్తోంది.  



అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి 


నందమూరి తారకరత్నకు జనవరి 27న కుప్పంలో గుండెపోటుకు గురై స్థానిక ఆసుపత్రిలో చేరారు. కుప్పం ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు వైద్యులు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తారకరత్నను పర్యవేక్షించేందుకు బెంగళూరు నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) ఒక బృందం కుప్పం వచ్చింది. అతని పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు కుప్పం వచ్చారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ (IABP) వాసోయాక్టివ్ మద్దతుతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 1 గంటలకు రోడ్డు మార్గంలో తారకరత్నను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికే అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ-డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.  


ఎక్మోపై చికిత్స 


ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో హీరో నందమూరి తారక రత్న చికిత్స పొందుతున్నారు. అత్యవసరం చికిత్సలో భాగంగా సీఐసీయూలో ఎక్మోపై ఉంచిన వైద్య సేవలు అందిస్తున్నారు. మరో 48 గంటలపై ఎక్మో చికిత్స అందించడంతోపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. తారకరత్నకు డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్నను చూసేందుకు ఆస్పత్రికి రాబోతున్నారు.  


అసలేం జరిగింది?


నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చింది. ఒక్క సారిగా ఆయన సొమ్మసిల్లి పడిపోవడంతో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు వెంటనే సమీప ఆస్పత్రికి తరంచారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం.. పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అనంతరం హీరో నందమూరి తారకరత్నను కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్‌ ద్వారా తరలించారు. కుప్పం నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.  తారకరత్న కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం బెంగుళూరుకు తరలించారు. కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి అంబులెన్స్ లు వేకువజామున బయల్దేరి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను చేర్చాయి.