Chandrababu Naidu Arrest: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఉదయం నుంచి వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సిద్దార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. సాల్వే వర్చువల్‌గా తన వాదనలు న్యాయమూర్తికి వినిపిస్తున్నారు. ఇక సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వర్చువల్‌గా వాదిస్తున్నారు. 


ఉదయం సాల్వే తర్వాత లూథ్రా వాదనలు వినిపించగా.. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15కి విచారణ వాయిదా పడింది. లంచ్ బ్రేక్ అనంతరం మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడని, ఎఫ్‌ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్నారు. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని,  పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని వాదించారు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయవచ్చని, ఎంతమంది సాక్షులను అయినా చేర్చవచ్చన్నారు.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయనేది విచారణ చేపట్టాల్సి ఉందని ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. 'సెల్ కంపెనీల జాడ తీస్తున్నాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్‌కు ఎలా వెళ్లింది? అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు' అని ముకుల్ వాదనలు వినిపించారు.


హరీశ్ సాల్వే వాదనలేంటి..?


ఇక చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్దమైనదని, సెక్షన్ 17ఎ పూర్తి వివరాలు తెలిసి ఉండి కూడా తప్పనిసరి అనుమతులు తీసుకోలేదన్నారు. గతంలో వచ్చిన జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారన్నారు. ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్- తేజ్‌మల్ చౌదరి కేసును సాల్వే ఉదహరించారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదని, దర్యాప్తు వేళ ఉన్న చట్టబద్ధత పరిగణించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 17ఎ వర్తిస్తుందని, చంద్రబాబు కేసులో అవినీతి నిరోధక చట్టం 17ఎ అనేది ఖచ్చితంగా వర్తిస్తుందన్నారు.


2018 చట్ట సవరణ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు 17ఎ వర్తిస్తుందని, ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు కనక ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే వాదించారు. ఇప్పుడు ఆయన పదవిలో లేరు కనుక ఆ నిబంధన వర్తించదనడం చట్టబద్దంగా చెల్లుబాటు కాదని, పాత ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఈ నిబంధన పెట్టారన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ కౌంటర్ తమకు ఇచ్చారని, కౌంటర్‌లో కూడా పొందుపర్చిన ఆరోపణలనే మళ్లీ చెప్పారన్నారు. ఈ సందర్భంగా అర్ణబ్ గోస్వామి కేసును సాల్వే ప్రస్తావించారు. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసుగానే పరిగణించాలని, వ్యక్తి స్వేచ్చకు భంగం కలుగుతుందన్న సమయంలో కేసును ఏకపక్షంగా చూడకూదన్నారు.