Indian Banking System: 


భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత బ్యాంకింగ్‌ (Indian Banking System) గురించి మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపించారు. మంగళవారం పార్లమెంటు కొత్త భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో ఆయన మాట్లాడారు.


'భారత బ్యాంకింగ్‌ రంగం అత్యున్నతంగా నిలబడింది. అందరికీ చర్చనీయాంశంగా మారింది. యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) వంటి టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రపంచ దేశాలకు ప్రేరణగా మారింది' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.


యూపీఏ పాలనలో బ్యాంకింగ్‌ వ్యవస్థ పతనమైందని జులై 22న ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. వరుస కుంభకోణాలతో బ్యాంకింగ్‌ రంగం నాశనమవ్వగా తన పాలనలో బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యం మెరుగైందన్నారు. బ్యాలెన్స్‌ షీట్లు, ఆస్తుల నాణ్యత పెరిగాయని వెల్లడించారు. ఇప్పుడు భారత్‌లో బ్యాంకింగ్‌ రంగమే పటిష్ఠతకు మారుపేరుగా నిలిచిందని స్పష్టం చేశారు.


రోజ్‌గార్‌ మేళాలో ప్రధాని నరేంద్రమోదీ 70,000 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ను వర్చువల్‌గా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ మందికి బ్యాంకింగ్‌ రంగమే ఉద్యోగాలు కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు. యూపీఐ పాలనలో నాశనమైన బ్యాంకింగ్‌ రంగాన్ని పటిష్ఠం చేసేందుకు తాము సరైన చర్యలు తీసుకున్నామని వివరించారు. 'గత యూపీఏ పాలనలో  అతిపెద్ద ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్ జరిగింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ మూలాలను దెబ్బకొట్టింది. తమకు నచ్చిన వ్యక్తులు, శక్తిమంతమైన నాయకులు, కుటుంబాలకు ఫోన్లు చేసి రుణాలు మంజూరు చేయించారు. ఆ రుణాలు ఎప్పటికీ తిరిగి చెల్లించేందుకు కాదు' అని మోదీ అన్నారు.


కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎవరూ పట్టించుకొనేవాళ్లు కాదు. ఇన్వెస్టర్లు ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు జంకేవారు. వృద్ధి ఆధారిత ప్రైవేటు బ్యాంకుల షేర్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. రెండేళ్లుగా పీఎస్‌యూ బ్యాంకు సూచీ మెరుపులు మెరిపిస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే 52 శాతం పెరిగింది. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే సగటున 12 శాతం వృద్ధి నమోదు చేసింది. యూకో బ్యాంకు 223, పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌ 178 శాతం రాబడి అందించాయి.


బ్యాంక్‌ ఆఫ్ మహారాష్ట్ర 140, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా 122 శాతం వరకు రాబడి ఇచ్చాయి. మార్కెట్‌ పరిస్థితులు బాగా లేకపోయినా, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరిగినప్పటికీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ మిగిలిన అన్నింటి కన్నా మెరుగ్గా రాణించింది. గతేడాది 52 శాతం పెరిగింది. ఇదే సమయంలో బ్యాంకు నిఫ్టీ సూచీ 12 శాతమే పెరగడం గమనార్హం. బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ సైతం ఈ స్థాయికే పరిమితమైంది.


మార్కెట్లో నిన్న ఏం జరిగిందంటే?


స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హాంకాంగ్‌, సింగ్‌పూర్‌, కొరియా సూచీలు ఎరుపెక్కగా మొన్నటి వరకు పతనమైన చైనా సూచీలు పుంజుకున్నాయి. ఈ వారం యూఎస్‌ ఫెడ్‌ సమావేశం కానుండటం, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పైగా భారత సూచీలన్నీ గరిష్ఠాల్లోనే ఉండటంతో ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 50 కీలకమైన 20,100 లెవల్‌ను నిలబెట్టుకుంది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.27 వద్ద స్థిరపడింది.