ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ( APIIC ) చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఎలాంటి జీతం అవసరం లేదని ఉచితంగానే పని చేస్తానని ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు గోవిందరెడ్డి లేఖలో తెలిపారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఏపీఐఐసీ చైర్మన్‌గా  రోజా పదవీ కాలం ముగిసిన తర్వతా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు. ఆప్పట్నుంచి ఆయన నెలవారీ జీతభత్యాలు తీసుకుంటున్నారు. కానీ హఠాత్తుగా తనకు జీతం వద్దనడానికి కారణాలేమిటన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయనకు జీతం తగ్గించింది. ఇటీవలి వరకూ ఏపీఐఐసీ ఛైర్మన్‌కు ఆర్ కేటగిరీ హోదాను ప్రభుత్వం కల్పించింది. వేతనంతో కలిపి ఇతర సౌకర్యాలకుగానూ 3లక్షల 82వేల రూపాయల వరకూ చెల్లించేవారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సంస్థల ఛైర్మన్‌ల వేతనాలపై ప్రభుత్వం ఇటీవల సీలింగ్ విధించింది. వేతనాలు 65 వేల రూపాయలు మించరాదని పేర్కోంది.  కానీ ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్ గౌరవ వేతనాలపై సీలింగ్ విధించటంతో ఒక్కసారిగా ఏపీఐఐసీ ఛైర్మన్ వేతనం రూ.65 వేలకు తగ్గింది. ఈ మొత్తం తీసుకున్నామన్న పేరు కూడా ఎందుకనుకున్నారేమో కానీ అసలే వద్దని లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం పార్టీ నేతలకు పదవులు ఇచ్చేందుకు ఎన్నో కార్పొరేషన్లు పెట్టింది. వాటన్నింటికీ నియామకాలు చేసింది. ఆ కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులకూ గౌరవ వేతనాలు ఇవ్వాల్సి ఉంది. అయితే అత్యంత కీలకమైన అంటే ఆర్ కేటగరిలోకి వచ్చి  కార్పొరేషన్ల చైర్మన్లకు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ గౌరవ వేతనం కూడా తగ్గించారు.  ప్రాధాన్యత ఉన్న ఏపీఐఐసీ చైర్మన్ లాంటి పోస్టులకు కూడా తీతాలు రూ. అరవై ఐదు వేలకు పరిమితంచేయడంతో ఎక్కువ మందికి జీతాలు తగ్గిపోయాయి. జీతం వద్దనడానికి అదే అసంతృప్తి కారణం  అయి ఉంటుందని భావిస్తున్నారు. 


మెట్టు గోవిందరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున అనంతపురం రాజకీయాల్లోకి వచ్చారు. రాయదుర్గం నుంచి  టీడీపీ తరపున ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతపురం స్తానిక సంస్థల నుంచి మరోసారి ఎమ్మెల్సీగా టీడీపీ తరపున గెలిచారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్‌సీపీలో  చేరారు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాపు రామచంద్రారెడ్డి గెలుపు కోసం పని చేయడంతో ఆయనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది.