CID  Wants Nara Lokesh Arrest : రెడ్ బుక్‌ పేరుతో సీఐడీ అధికరులను జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని .. ఆయనను అరెస్టు చేసేందుకు అవకాశం ఇవ్వాలని  సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను నారా లోకేష్ ఉల్లంఘించారని సీఐడీ తెలిపింది.  చంద్రబాబు కేసు దర్యాప్తు అధికారులను రెడ్‌బుక్‌ పేరుతో లోకేష్ బెదిరిస్తు్న్నారని  సీఐడీ తెలిపింది.  దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామన్న లోకేష్‌ ప్రకటనలపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెడ్‌బుక్‌ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరింది. సాక్ష్యాలు ఏమిటని  అడిగితే.. పత్రికల క్లిప్పింగ్‌లను సీఐడీ తరపు లాయర్లు చూపించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోలేదు.  ఐఆర్‌ఆర్‌ కేసులో గతంలోనే లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీఐడీ...రెండు సార్లు విచారణ జరిపింది. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ను ఏ -14 గా సీఐడీ కేసు పెట్టింది.               

  


రాజకీయ కారణాలతో తప్పుడు కేసులు పెట్టిన... టీడీపీ కార్యకర్తల్ని వేధించిన అధికారులందరి పేర్లను రెడ్ బుక్‌లో రాసుకుంటున్నామని ప్రత్యేకంగా కక్ష సాధింపుల శాఖను తనే చూసుకుంటానని నారా లోకేష్ చెబుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత టీడీపీ నేతలు , కార్యకర్తలపై వేల కొద్దీ కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతలు దాడులు చేసి తమ మీద కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. చివరికి టీడీపీ ఆఫీసు మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేస్తే కేసులు కూడా తమపైనే పెట్టారని అంటున్నారు. ఇలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులు ఎవర్నీ వదిలేది లేదని లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. 


అయితే రెడ్  బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో.. లోకేష్ చెప్పలేదు. ప్రత్యేకంగా ఫలానా అధికారి అని చెప్పలేదు. తప్పుడు కేసులు పెట్టిన వారిని మాత్రమే అని చెబుతున్నారు. అయినా పేపర్ క్లిప్పింగులు ఆధారంగా సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు వెళ్లి.. నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయాలని కోరడం పై టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ కేసులో నారా లోకేష్ గతంలోనే ముందస్తు బెయిల్ కోసం పటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు అరెస్టు చేయబోమని సీఐడీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అరెస్టు కోసం విజ్ఞప్తి కావాలనుకంటే హైకోర్టుకే  వెళ్లాల్సి ఉంటుందని.. కానీ ఏసీబీ కోర్టుకు అధికారం ఉందని గుర్తు చేస్తూ..  మళ్లీ దిగువ కోర్టుకు వెళ్లడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.                          


ఐఆర్‌ఆర్ కేసులో  అసలు రింగ్ రోడ్ లేదు.. భూసేకరణ లేదు.. అయినా లబ్ది కలిగిందని కేసులు పెట్టారని..   ఇలాంటి తప్పుడు కేసులో.. తమపై బురద చల్లేందుకు.. ఎన్నికల సన్నాహాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు.