Cases On Ramojirao :  ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై నిర్వహించిన సోదాల్లో ఉల్లంఘనలు బయటపడ్డాయని ఏపీసీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలు ఉల్లంఘించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొంత కాలంగా మార్గదర్శి చిట్ ఫండ్స్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. శనివారం కూడా పెద్ద ఎత్తున మార్గదర్శి మేనేజర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అయితే పదో తేదీన అంటే శుక్రవారమే ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లుగా ఏపీసీఐడీ ప్రకటించింది. పలు జిల్లాల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచుల్లో అక్రమాలు వెలుగు చూశాయని..అందుకే వేర్వేరుగా ఎఫఐఆర్‌లు దాఖలు చేసినట్లుగా తెలిపింది. 


ఐపీసీ, ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్, చిట్ ఫండ్ చట్టాల కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు                


మొత్తం మూడు చట్టాల  కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్  34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్  మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982  లోని సెక్షన్   76,79 ప్రకారం  ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది. ఇందులో ఇన్వెస్టింగేటింగ్ అధారిటీగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉందని సీఐడీ ఓ ప్రకటనలో తెలిపింది. 


నిందితులుగా మొదట రామోజీరావు, తర్వాత శైలాజా కిరణ్.. తర్వాత బ్రాంచ్ మేనేజర్                      


నమోదైన ఎఫ్ఐఆర్‌లలో  చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్,  అలాగే ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్,  అలాగే ఆయా బ్రాంచీల మేనేజర్ల పేర్లను చేర్చారు. ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయన్న విషయాన్ని సీఐడీ తన ప్రకటనలో తెలియచేయలేదు. అయితే  ఏఏ నగరాల్లో బ్రాంచీల్లో కేసులు నమోదు చేశారో వివరించారు. విశాఖపట్నం, రాజమహేంద్ర వరం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచిల్లో నిబంధనల ఉల్లంఘనపై ఈ కేసులు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.  అలాగే నర్సరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచీల ఫోన్‌మెన్ పరారీలో ఉన్నారని సీఐడీ తెలిపారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. 


శనివారం ఉదయం నుంచి సోదాలు                   


శనివారం ఉదయం నుంచి సీఐడీ  రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలోననూ సీఐడీ సోదాలు చేశారు.   చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణలు ఉన్నాయని సీఐడీ అధికారులు ప్రకటించారు.  విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ లో మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గతంలోనూ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.  నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. గతంలో హైదరాబాద్‌లోనూ సీఐడీ సోదాలు చేపట్టింది. దీనిపై మార్గదర్శి ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించింది.