Bandar Port : బందరు పోర్ట్ పనులను త్వరలో ప్రారంభించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతుంది.ఉగాది తరువాత సీఎం జగన్ నేరుగా పనులను ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరం అయిన మౌళిక సదుపాయాలు పై ఎమ్మెల్యే పేర్ని నాని సమీక్ష నిర్వహించారు..బందరు పోర్ట్ కు మరో సారి శంఖుస్దాపన ఉండదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. నేరుగా పనులను ప్రారంభం మాత్రమే ఉంటుందని, అది కూడా సీఎం జగన్ చేతులు మీదగానే ఆరంభం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బందరు పోర్ట్ నిర్మాణ పనులు పై అనేక దశాబ్దాలుగా సందిగ్దత కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు బందరు పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు శంఖుస్దాపన చేశారు. అయితే ఆనాటి పునాది రాళ్ళు కూడా కనుమరుగు అయిపోయాయి.
పోర్ట్ నిర్మాణం జరిగితే దశాబ్దాలుగా కలలు కంటున్న స్దానికుల కల తీరుతుంది. కేంద్రం సహకారంతో అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి, నిర్మాణ పనులకు శంఖుస్దాపన కాకుండా, పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ బాలశౌరి చెబుతున్నారు. బందరు పోర్ట్ నిర్మాణం విషయంలో స్దానిక శాసన సభ్యుడు పేర్నినాని, పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి మOd/ విభేదాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయి. ఈ కారణంతోనే బందరు పోర్ట్ పనుల ను నేరుగా ప్రారంభించేందుకు రావాల్సిన ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడ వాయిదా పడిందనే ప్రచారం ఉంది. అయితే తాజాగా శాసన సభ్యుడు పేర్ని నాని పోర్ట్ పనులను ప్రారంభించేందుకు అవసరం అయిన మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు.
స్దానికంగా పర్యటించి, వాహనాల రాకపోకలు, ముడి సరుకు రవాణాకు అవసరం అయిన మార్గాల ఏర్పాటు పై అధికారులతో చర్చించారు. దీంతో పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఉగాది తరువాత ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఖరారు అవుతుందని చెబుతున్నారు. బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని గతంలోనే అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది. దీంతో క్యాబినేట్ సమావేశంలో రుణం తీసుకునే అంశం పై చర్చించారు. రుణం పొందేందుకు క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి 2 కిలోమీటర్ల 325 మీటర్ల దక్షిణం, ఉత్తరం బ్రేక్స్ వాటర్ గోడల నిర్మాణాలకు రూ.446 కోట్లు అవసరం అవుతాయని ఇప్పటికే అంచనాలు కూడ రూపొందించారు. ఉత్తరం వైపున 250 మీటర్ల కొండరాళ్లతో కాంక్రీట్ గోడ నిర్మాణానికి రూ. 10. 94 కోట్లు, అలాగే దక్షిణం వైపున సడన్ బ్రేక్ వాటర్ రూ. 435 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. డ్రెడ్జింగ్ కోసం మరో రూ.1242.88 కోట్లు, సముద్రం నుంచి ఓడలు రావడానికి అప్రోచ్ ఛానెల్ నిర్మాణానికి రూ. 706.26 కోట్లు, బ్రేక్ వాటర్ మధ్యలో ఓడలు తిరగడానికి టర్నింగ్ సర్కిల్, బెర్త్ పాకెట్స్ కోసం రూ.452.07 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ రెడీ చేశారు.
బందరు పోర్టులో మొదటి విడతగా 4 బెర్తుల నిర్మాణం జరుగుతుందని.. మూడు బెర్తుల కోసం రూ.548 కోట్లు, బల్క్ కార్గో కోసం ఒక బెర్త్ .. దీనికి రూ.158 కోట్లు వ్యయం అవుతుందని ఇప్పటికే ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే 80 వేల టన్నుల బరువుతో వచ్చే షిప్పులు సైతం సురక్షితంగా రాగలుగుతాయన్నారు. లక్ష నుంచి లక్షన్నర బరువుతో ఉండే షిప్పులు వచ్చే బెర్తులను సెకెండ్ ఫేజ్ లో నిర్మిస్తామన్నారు. అదేవిధంగా బందరు పోర్టు నిర్మాణానికి 1730 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.మొదటి దశలో ఒక్క ఎకరం ప్రైవేట్ భూమి కూడా తీసుకోవడం లేదన్నారు.రైల్, రోడ్డు నిర్మాణానికి 235 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లను నిర్మించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.