YS Sharmila Slams Ysrcp Government: రాష్ట్రంలో సంక్షేమం పేరిట ఓ చేత్తో మట్టి చెంబు ఇచ్చి వెండి చెంబు తీసుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఇసుక మాఫియా వల్ల ప్రజల భూములు కబ్జాకు గురవుతున్నాయని.. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా.? అని ప్రశ్నించారు. గుంటూరు (Guntur) జిల్లా తెనాలి (Tenali) మండలం కొలకలూరులో గురువారం ఆమె పర్యటించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల మండిపడ్డారు. ఎన్నికల స్టంట్ లో భాగంగానే నోటిఫికేషన్ ఇచ్చారని.. అది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని ఎద్దేవా చేశారు. 'ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం అమ్మకాలు, మద్యం మృతులు ఎక్కువే. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ హామీ ఇచ్చి మాట తప్పారు. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. పేదలకు 25 లక్షల ఇళ్లు కటిస్తానన్న జగన్.. ఒక్క ఇల్లు అయినా కట్టారా.?. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటెయ్యండి. కాంగ్రెస్ వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ మొదటి సంతకం దాని పైనే చేస్తారు.' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.


షర్మిలకు భద్రత పెంపు


మరోవైపు, షర్మిలకు భద్రతను పెంచుతున్నట్లు కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. స్థానికంగా ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో షర్మిలకు తెలంగాణ పోలీసులు... 4+4 భద్రత కల్పించారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ఏపీ సర్కార్ 1+1 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే, తనకు సెక్యూరిటీ పెంచాలంటూ షర్మిల డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. 4+4 భద్రత, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని కోరుతూ జనవరి 22న లేఖ రాశారు. షర్మిల కార్యకర్తల సమావేశాల కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారని... ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసరంగా ఆమెకు.. 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ డీజీపీని కోరారు. మరోవైపు, షర్మిల సైతం తనకు భద్రత పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా.?' అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించే సమయంలో ఆమెకు భద్రత పెంచుతామని జిల్లా ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. 1+1 స్థానంలో 2+2 భద్రత కల్పిస్తామని చెప్పారు. 


Also Read: BAC Meeting: 4 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు - బీఏసీ సమావేశంలో నిర్ణయం