Telangana Assembly Budget Sessions 2024: తెలంగాణ అసెంబ్లీలోని (Telangana Assembly) స్పీకర్ ఛాంబర్ లో గురువారం బీఏసీ సమావేశం (BAC Meeting) ముగిసింది. ఈ నెల 13 వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 10న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు. 12, 13న బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరగనుందని వెల్లడించారు. కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అటు, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, హరీష్ రావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.


బీఆర్ఎస్ నేతల ఆగ్రహం


మరోవైపు, బడ్జెట్ సమావేశాలు 4 రోజులే నిర్వహించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ కనీసం 12 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందని.. సభ కనీసం 12 రోజులు నిర్వహించాలని సర్కారును కోరినట్లు తెలిపారు. అవసరమైతే 13న మరోసారి బీఏసీ నిర్వహిస్తామని చెప్పారని కడియం పేర్కొన్నారు. 'త్వరగా బడ్జెట్ ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశమే లేకుండా పోతుంది. హామీలపై నిలదీస్తామనే త్వరగా ముగించాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రోటోకాల్ వివాదం ఏర్పడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడినా వారే మాకు ఎమ్మెల్యేలు అని సీఎం చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అధికారులు రెచ్చిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తుంది. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూస్తామని సభాపతి, సీఎం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీల అమలుపై ప్రశ్నిస్తామనే 4 రోజులే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో అవకాశం రాకపోయినా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.' అని కడియం స్పష్టం చేశారు.


బీఏసీ నుంచి వెళ్లిపోయిన హరీష్ రావు


మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ కు బదులు హరీశ్ రావు హాజరయ్యారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...శాసనసభా వ్యవహారాల మంత్రికి సమాచారం కూడా ఇచ్చారు. అయితే బీఏసీ సమావేశానికి హరీశ్ రావు రావడాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. కేసీఆర్ కు బదులు హరీశ్ రావు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ రావు సమావేశంలో పాల్గొనకుండానే బయటకు వచ్చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. అయితే, తాము ఎవరినీ బీఏసీ సమావేశం నుంచి వెళ్లమని చెప్పలేదని.. స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ.. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఆ పార్టీ నుంచి కేసీఆర్, కడియం పేర్లు ఇచ్చారని.. కేసీఆర్ రావడం లేదు కాబట్టి తాను వస్తానని హరీష్ రావు చెప్పినట్లు వెల్లడించారు. ఒక సభ్యుడు రావడం లేదని.. ఇంకో సభ్యున్ని అనుమతివ్వరని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎలాంటి లేఖ రాలేదని.. ఎన్ని రోజులైనా సభ నడుపుతామని అన్నారు.


Also Read: KTR Vs Rajagopal Reddy: 'మంత్రి పదవి ఎప్పుడు?' - కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ