ఏపీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలోని టీడీపీ ఆఫీసులపై మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడులకు పాల్పడింది వైఎస్ఆర్సీపీ శ్రేణులని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఈ దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మల్లాది విష్ణు అంటున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభిరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అల్లకల్లోలం సృష్టి్స్తున్నాయి. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు  నోటీసులు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పట్టాభి సీఎం జగన్, వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నిరసనగా కొందరు టీడీపీ కార్యాలయాలపై మెరుపుదాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. 



టీడీపీ కార్యాలయాలపై దాడులు


ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్‌ను టీడీపీ నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ కొందరు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న కెమెరా మెన్‌ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు.



Watch: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా.. ప్రభుత్వంపై అచ్చెన్న సీరియస్‌



'చంద్రబాబుగారూ... మీరు మాట్లాడించిన పదం అర్థం తెలుసా. మీ అధికార ప్రతినిధి మాట్లాడాడు. కాబట్టే దీనికి మీరు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. మిమ్మల్ని బో** అంటే మీరు ఊరుకుంటారా? మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని అడుగుతున్న చంద్రబాబుగారు, బూతులు మాట్లాడే స్వేచ్ఛను కూడా తెలుగుదేశం పార్టీ వాక్‌స్వాతంత్య్రంగా గుర్తిస్తోందా అన్నది సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రిని అసభ్య భావజాలంతో తిట్టించటం మీ కల్చర్‌లో భాగమా అన్నది చెప్పాలి' అని వైసీపీ నేతల ప్రశ్నించారు.  ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన జారీచేసింది. 






40 ఏళ్ల రాజకీయంలో అన్నీ కుతంత్రాలే


తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైసీపీ నేతలు దాడి చేయలేదు. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి, బూతులు తిట్టి, ఎక్కడికక్కడ ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో చివరికి పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని తెగ ఊగిపోతున్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడినా, ప్రతి ఎన్నికల్లో ఓడుతున్నా ప్రజలకు సిగ్గు లేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలే అనరాని మాటలన్నారని వైసీపీ నేతలు అన్నారు. సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్‌ ట్యాగ్‌ లైన్‌ను కూడా హత్య చేసి, ప్రజల్ని కూడా తిట్టటం టీడీపీ రాజకీయంలో భాగంగా మారిందని ఆరోపించారు. మరి ప్రజలకు కడుపు మండదా, ప్రజల్ని తిట్టినప్పుడు, వారు వారిదైన రీతిలో వారికి అవకాశం వచ్చినప్పుడు సమాధానం ఇస్తారన్నారు. పోలీసుల్ని, అధికారుల్ని, నాయకుల్ని తిట్టి, చివరికి ఈ రాష్ట్రంపై కసి, ద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. అధికారం దక్కలేదని ప్రతి రోజూ పేదల ప్రభుత్వం మీద ఏదో విధంగా దాడి చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని రకరకాల కేసుల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో కనిపించేవన్నీ కుట్రలు, కుతంత్రాలే తప్ప ప్రజా తంత్రం కాదని వైసీపీ నేతలు విమర్శించారు. 


వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే భాష


'చంద్రబాబు గారూ... ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండే మీరు, ఇంతకీ ఈ రోజు విజయవాడలో  చెప్పా పెట్టకుండా ఎందుకు దిగారు? కరకట్ట పక్కన ఎందుకు ఉన్నారు? మీ పార్టీ ఆఫీసుకు రాకుండా ఎందుకు దాక్కున్నారు? ఏ మంటలు పెట్టటానికి ఏపీలో అడుగుపెట్టారు? రెండున్నరేళ్ళుగా, అందులో ఏడాదిన్నర కోవిడ్‌ కాలంలో కూడా చెక్కు చెదరని నిశ్చయంతో పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడలేక ఇంతకు దిగజారతారా? ఆర్టికల్‌ 356 ప్రయోగించాలా? పేదలకు, దిగువ మధ్యతరగతికి అనేక మేళ్ళు చేసే జగన్‌గారి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన కష్టం, నష్టం ఏమిటని' వైసీపీ ప్రశ్నించింది.  ఈ రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా ఫెయిల్‌ అయిందంటున్నారని, కానీ ఫెయిల్‌ అయింది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబే అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేని పరిస్థితి టీడీపీదని వైసీపీ నేతలు ఆరోపించారు.  సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేని పరిస్థితికి వచ్చారన్నారు. ఎటు చూసినా భవిష్యత్తు లేదని కాబట్టే రెచ్చగొట్టే భాషను వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా బూతుల్ని ప్రెస్‌మీట్లలో మాట్లాడారని వైసీపీ తెలిపింది. 


Also Read:  ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి