ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై యాభై మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన సామాగ్రినంతటిని ధ్వంసం  చేశారు. పట్టపగలు అందరూ చూస్తూండగానే నింపాదిగా దాడులు చేసి వెళ్లిపోయారు. గతంలో ఓ రెండు సార్లు పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. అయినా పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాటు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారని భావిస్తున్నారు. 



ఒక్క పట్టాభిరామ్ ఇంటిపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులు జరిగాయి. కొంత మంది సెక్యూరిటీని నెట్టేసి కార్యాలయంలోకి దూసుకెళ్లి దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టినట్లుగా తెలుస్తోంది. కడప సహా పలు చోట్ల టీడీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడా పోలీసులు అడ్డుకోవడం కానీ ..  భద్రత కల్పించడం కానీ చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


Also Read: ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !


గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో  వైసీపీ నేతలపై నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేయడంతో నర్సీపట్నం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అర్థరాత్రి ఇంటికి వెళ్లారు. ఈ అంశంపై ఉదయం మీడియాతో మాట్లాడిన పట్టాభిరామ్ వైసీపీ నేతలు, పోలీసుల వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా చేయిస్తున్నారని.. గంజాయి వ్యవహారంపై  మాట్లాడకుండా బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఈ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే దాడులకు దిగినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. 



Also Read: టీడీపీ కార్యాలయాలపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ


కొద్ది రోజులుగా ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అన్నీ గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ ఆరోపణల చుట్టూనే తిరుగుతున్నాయి. రాజకీయ నేతలు, ఆరోపణల మధ్యలో పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తోంది. సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం పెట్టారు. గంజాయి అక్రమ రవాణా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.  గంజాయి స్మగ్లింగ్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.  అనూహ్యం అర్థరాత్రి సమయంలో నర్సీపట్నం పోలీసులు గుంటూరులోని నక్కా ఆనంద్ బాబు ఇంటికి వచ్చారు. నర్సీపట్నం సీఐ కూడా వచ్చారు. అర్థరాత్రి పూట నిద్రలో ఉన్న నక్కా ఆనంద్ బాబును లేపారు. సోమవారం మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో గంజాయి మాఫియా అని ఆరోపణలు చేశారని .. దానికి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేయడానికి వచ్చామని చెప్పారు.  నోటీసులు ఇవ్వడానికి అర్థరాత్రి రావాలా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఉదయమే వస్తామని వెళ్లిపోయారు. 



Watch: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా.. ప్రభుత్వంపై అచ్చెన్న సీరియస్‌


ఈ అంశంపై పట్టాభిరామ్ తీవ్రమైన విమర్శలు చేయడంతో  వైసీపీ నేతలు దాడులకు తెగబడినట్లుగా తెలుస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా  మూకుమ్మడిగా ఒకే సారి నిరసనలు.. టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరగడంతో ప్రణాళికతోనే చేశారని అనుమానిస్తున్నారు. అందరికీ ఒకే సారి దాడులు చేయాలని  సమాచారం పంపారని.. అడ్డుకోవద్దని పోలీసులకు కూడా ఆదేశాలిచ్చారని.. పోలీసులు  పాటించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి