AP TDP President Achchennaidu :  ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా సభలు నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వని ప్రభుత్వం వైసీపీ నేతల సభలకు మాత్రం ఆగమేఘాల మీద ఒప్పుకోవడం అప్రజాస్వామికమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.  ప్రతిపక్షాల సభలకు అనుమతులు నిరాకరిస్తూ అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు, నిరంకుశ చర్యలతో వేధింపులకు గురిచేస్తూ వైసీపీ నేతలకు మాత్రం నడిరోడ్డు మీద అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు.  ఆసరా, సిద్ధం అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేలా, ట్రాఫిక్‌ జామ్‌ చేసేలా అనుమతులు ఎలా ఇస్తారు? రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ లేదని మండిపడ్డారు. 


రాప్తాడు సభకు నేషనల్ హైవే పక్కన అనుమతి 
 
వైసీపీ రాఫ్తాడులో చేపట్టిన సభకు నేషనల్‌ హైవే పక్కన ఏ విధంగా అనుమతిస్తారు? నిత్యం వేలాదిమంది బెంగుళూరు`హైదరాబాద్‌ వెళ్లే రహదారి పక్కన సభకు అనుమతిచ్చి లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సైకోతత్వానికి నిదర్శనమన్నారు.  సభకు వారం రోజుల ముందునుంచే జాతీయ రహదారి మీద కూడా ఆంక్షలు విధించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.  రైతులు తమ ఉత్పత్తులను బెంగుళూరు, హైదరాబాద్‌ మార్కెట్లకు తరలించలేని పరిస్థితి నేడు నెలకొందన్నారు.   ఫిబ్రవరి 18న మీటింగ్‌ ఉంటే 11 వ తేదీ నుంచే ఆంక్షలు విధిస్తారా అని ప్రశ్నించారు. తెలుగుదేశంపార్టీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వని అధికారులు ఈ సభలకు ఎందుకు ఇస్తారు? వైసీపీ నేతల ఆగడాలు ఇంకెన్ని రోజులో సాగవు.. కౌంట్‌డౌన్‌ మొదలైందిన్నారు. 


రాప్తాడు సిద్ధం సభ కోసం భారీగా ఆంక్షలు 


ఈ నెల 18న  జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం సభ కారణంగా  ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.  వాహనదారులకు, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గలు చూపించామని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. వాహనాల రాకపోకల మళ్లింపు ప్రదేశాలలో ‘ట్రాఫిక్‌ డైవర్షన్‌‘ వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన రోజున పంగల్‌ రోడ్డు, కలెక్టరేట్‌, ముసలమ్మకట్ట, ఎన్టీఆర్‌ మార్గాలు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే అవకాశం ఉంటాయని,  ఆయా మార్గాల్లోని స్థానికులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యామ్నాయ రహదారుల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. బెంగుళూరు నుంచి అనంతపురం మీదుగా హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు  శ్రీసత్యసాయి జిల్లా మామిళ్లపల్లి వద్ద మళ్లించారు. హైదరాబాద్‌ నుంచి అనంతపురం మీదుగా బెంగుళూరు వైపు వెళ్లే వాహనాలను అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి వద్ద మళ్లించారు. ఈ ఆంక్షలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


పర్చూరు రా .. కదలి రా సభకు ఆటంకాలు


మరో వైపు  బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో చంద్రబాబు తలపెట్టిన రా..కదలిరా సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ నేతుల ఆరోపించారు.   దేవాదాయశాఖ భూమిలో సభ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు వచ్చినందున పనులు నిలిపేయాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారన్నారు.  ఇంకొల్లు-పావులూరు రహదారి పక్కన 30 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 19 ఎకరాలు దేవాదాయశాఖ భూమి ఉంది. మిగిలిన భూమి ప్రైవేటుది. వారంతా అంగీకారం తెలిపారు. దేవాదాయశాఖ భూమి 13 ఎకరాలను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతు సభ నిర్వహణకు అంగీకారం తెలపడంతో ఆ స్థలంలో పనులు ప్రారంభించారు. దీనిపై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం ఏర్పడింది. అయితే అక్కడే సభ నిర్వహించి తీరుతామని టీడీపీ నేతలన్నారు 


ఇలా విపక్షాల సభలకు ఆటంకాలు కల్పిస్తూ.. అధికారపక్షం మాత్రం జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా మళ్లిస్తూ సభలు నిర్వహించుకోవడం ఏమిటని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రూల్ ఆఫ్ లా లేదంటున్నారు.