AP Ration Dealers Agitation: రేషన్ స్టాక్ గోనె సంచులు వెనక్కి తీసుకుని డబ్బులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాలలో డీలర్లు స్టాక్ పాయింట్ల వద్ద నిరసన చేశారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ నిలిపివేసి నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 10ని రద్దు చేసి ఖాళీ గోతాలను డీలర్లకే ఇవ్వాలని కోరారు. 


Also Read: విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు... పారదర్శకంగా నియామకాలు చేపట్టండి... ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష


కమీషన్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్


ఇంటింటికీ సరకుల పంపిణీ వచ్చాక ఆదాయాన్ని కోల్పోయామని రేషన్ డీలర్లు అన్నారు. ఇంటింటికీ సరకులు అందించడానికి మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ పేరుతో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి, ఎండీయూ ఆపరేటర్ ని కూడా నియమించారని తెలిపారు. వీరికి జీతాలు ఇస్తూ డీలర్లను డమ్మీలను చేశారని ఆరోపించారు. ఓ దశలో రేషన్ డీలర్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేస్తారని అనుకున్నా వారికి కమీషన్ ఇస్తామని చెప్పి ఎండీయూ ఆపరేటర్ల ద్వారానే పనిచేయిస్తున్నారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ సరకులు మాత్రం డీలర్లు నేరుగా చౌకధరల దుకాణాల్లోనే అందిస్తున్నారని రేషన్ డీలర్ల సంఘం తెలిపింది. 2020 నుంచి డీలర్లకు కమీషన్లు కూడా సరిగా ఇవ్వడంలేదని ఆరోపించింది. దీంతో డీలర్లు ఎప్పటికప్పుడు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. 


Also Read: ఏపీలో రేపట్నుంచి రేషన్ స్టాక్ దిగుమతి బంద్... బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్లు డిమాండ్


విద్యుత్ చార్జీలను మోయలేక అవస్థలు


గతంలో గోనె సంచుల్ని డీలర్లే అమ్ముకునేవారు. ఇటీవల బియ్యం నిల్వచేసే గోనె సంచుల్ని ప్రభుత్వమే డీలర్ల వద్ద తీసుకుంటోంది. వాటికి డబ్బులు చెల్లిస్తామని కూడా మాటిచ్చింది. అయితే ఇప్పుడు గోతాలు తీసుకుని నగదు చెల్లించలేమని తెలిపింది. దీంతో డీలర్లు మరోసారి ఆందోళనకు దిగారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులు, షాపు అద్దెలు, విద్యుత్ చార్జీలను మోయలేక అవస్థలు పడుతూనే  రేషన్ షాపులు నడుపుతున్నామని డీలర్లు వాపోతున్నారు. దీనికి తోడు కొద్దో గొప్పో ఆదాయం వచ్చే గోనె సంచుల్ని కూడా ప్రభుత్వమే తీసుకుంటే తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆందోళనకు దిగారు.


Also Read: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి