ఏపీలో రేపట్నుంటి రేషన్ స్టాక్ దిగుమతి నిలిపివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు రేషన్ దిగుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా పంపిణీ కూడా నిలిపివేస్తామని ప్రకటించినా ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేస్తుంది. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్లించిన కందిపప్పునకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు కోరుతున్నారు. డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. మార్చి 29, 2020 నుంచి ఇప్పటి వరకూ ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు.
జీవో 10ని యథాతథంగా అమలు చేయాలి
గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే ప్రతీ సంచికి రూ.20 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు నగదు ఇవ్వమని చెప్పడం సరికాదని డీలర్లు ఆక్షేపించారు. గోనె సంచులు తిరిగి ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చరించడం తగదన్నారు. గోనె సంచులను ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తుచేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్ డీలర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: ఈ పథకంతో కోట్లాది మందికి లబ్ధి.. దీపావళి వరకు ఉచిత రేషన్: మోదీ
రేషన్ పంపణీ బంద్ ఉపసంహరణ
రేపట్నుంచి తలపెట్టిన రేషన్ షాపుల బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని విజయవాడలో రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రకటించారు. ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం స్పందించాలని కోరారు. కమీషన్ బకాయిలు చెల్లించడంతో పాటు, గోనె సంచులకు ఎప్పటిలాగా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో రేషన్ దుకాణాలకు సంబంధించి అధికారులు మారినప్పుడుల్లా విధానాలను మార్చడం సరికాదని రేషన్ డీలర్ల సంఘం అభిప్రాయపడింది. రేపటి నుంచి ఎం.యల్.ఎస్ పాయింట్ల దగ్గర ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం స్పందించే వరకు వచ్చే నెల స్టాకును దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే బంద్ ను ప్రకటిస్తామని హెచ్చరించారు.
Also Read: ఏపీలో కోటి మందికి రేషన్ కట్ చేస్తున్నారా..? నిజమేంటి..?