ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలంతా ఆధార్ సెంటర్ల వద్దకు క్యూ కట్టారు. రేషన్ కార్డులో ఉన్న కుటుంబసభ్యులందరూ ఈ-కేవైసీ చేయించుకోకపోతే వారికి వచ్చే నెల నుంచి రేషన్ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పనులు మానుకుని పేదలంతా ఆధార్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. అక్కడక్కడా తొక్కిసలాట జరుగుతోంది.
వంద శాతం లబ్దిదారుల ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏపీ లక్ష్యం..!
కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా సంస్కరణలు తీసుకు వచ్చింది. ఈ సంస్కరణలు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. అలా అమలు చేసినందుకు అదనపు రుణం కూడా ఏపీ ప్రభుత్వానికి మంజూరు చేసింది. ఈ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే తమ రాష్ట్రంలో ఉన్న లబ్దిదారులందరి ఈ - కేవైసీని పూర్తి చేయాల్సి ఉంది. అలా పూర్తి చేస్తేనే మాన్యువల్ పద్దతి నుంచి ఈ పోస్ యంత్రాల ద్వారా రేషన్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. కేంద్రం ఈ - కేవైసీకి పూర్తి స్థాయిలో ఒత్తిడి తేవడానికి కారణం పక్కదారి పడుతున్న రేషన్‌ను కాపాడుకోవడమే. అనర్హులు, చనిపోయినవారు, వలస వెళ్లినవారు ఇలా అనేక మంది ఈ-కేవైసీ చేయించుకోలేరు. దాని వల్ల వారిని అర్హుల జాబితా నుంచి తొలగించవచ్చు.
వాలంటీర్లు సహకరించడం లేదని ఆధార్ కేంద్రాలకు లబ్దిదారుల పరుగు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సంస్కరణలను వేగంగా అమలు చేసే విధానంలో భాగంగా వచ్చే నెలలోపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఈ-కేవైసీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఏపీలో దాదాపుగా కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 4 కోట్ల 31 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నారు. వీరిలో దాదాపుగా కోటి మంది ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోలేదు. ప్రభుత్వం వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది. కానీ వాలంటీర్లు ఇదో అదనపు పనిగా భావించి పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో ఎక్కువ మంది ఆధార్ కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో గందరగోళం ఏర్పడుతోంది. నిజానికి ఈ - కేవైసీ చేయించుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు.
వాలంటీర్లు చేస్తారు కంగారు వద్దన్న ప్రభుత్వం !
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ -కేవైసీ నమోదు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో ఇంకా పది శాతం మందికిపైగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉందని... రేషన్ కార్డులను తొలగిస్తామని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ కోన శశిధర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకుంటే ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చన్నారు. అసలు ఆధార్ కార్డు లేని వాళ్లు మాత్రమే .. ఆధార్ నమోదు చేయించుకోవాలని మిగతా వారికి వాలంటీర్ ఈ-కేవైసీ చేస్తారని శశిధర్ స్పష్టం చేశారు.