Andhra Pradesh Rains News Updates | ఏపీలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్త. రాగల 2-3 గంటల్లో కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలను అప్రమత్తం చేసింది ఆ సమయంలో గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతిచెందారు. మృతులలను గడ్డం బ్రహ్మయ్య(50), సుప్రదీప్(23)గా గుర్తించారు.
ముఖ్యంగా చెట్ల కిందకు మాత్రం వెళ్లకూడదని హెచ్చరించారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు కింద నిలబడరాదని అవి కూలిపోయే ప్రమాదంతో పాటు పిడుగు పడే అవకాశం అధికంగా ఉంటుందని విపత్తుల సంస్థ అలర్ట్ చేసింది. ఈ మేరకు అధికారులు, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోం మంత్రి అనిత ఆదేశాలు
ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇదివరకే విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఏయో జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరా తీశారు. కొన్ని జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి అందుకున్న సమాచారంతో హోం మంత్రి వంగలపూడి అనిత పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యాలని.. అవసరమైన మేరకు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆమె ఆదేశించారు. అసలే వేసవి కాలం కావడంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కొన్నిచోట్ల నేడు సైతం 41 నుంచి 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. మే 7వ తేదీ వరకు ఏపీలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. కొన్నిచోట్ల భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతే, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో సతమతం కానున్నారు.