AP Power Employees to go on strike:
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదివరకే టీచర్లు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పలుమార్లు సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విధానంలో తమ ఆలోచనలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుందని ఉద్యోగ సంఘాలు సైతం విమర్శించాయి. తాజాగా ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. అలవెన్సులు, జీపీఎఫ్, రివైజ్డ్ పే స్కేళ్లు సహా తదితర అంశాలను పరిష్కరించకుండా జగన్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించకోలేదని ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. 


డిమాండ్ల పరిష్కారానికి దశల వారీగా నిరసనలు, ఆందోళనలు 
దశలవారీగా రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ముందుగా జులై 27వ తేదీన భోజన విరామంలో నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగులు నిరసనను ప్రారంభించనున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటంలో జగన్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శి్స్తోందని ఈ నెల 27 నుంచి విద్యుత్ సిబ్బంది నిరసనకు సిద్ధమయ్యారు. సమ్మె, ఆందోళనల నోటీసును విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోల ఎండీలకు, డిస్కంల సీఎండీలకు అందజేశారు. తొలి దశలో జులై 27 తేదీ నుంచి మొదలుపెట్టననున్న నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు ఆగస్టు 9 తేదీ వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తే నిరవధిక సమ్మెను విరమించుకుంటానమి చెప్పారు. ఆ ఆందోళనలు, నిరసనలలో రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, డివిజన్‌, జోనల్‌, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల కార్పొరేట్‌ ఆఫీసులలో సేవలు అందిస్తున్న సిబ్బంది పాల్గొననున్నారు. లేనిపక్షంలో ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు స్పష్టం చేశారు.


విజయవాడలోని విద్యుత్‌ సౌధ వద్ద ఆగస్టు 8న మహాధర్నా నిర్వహించనున్నారు. మరుసటి రోజు ఆగస్టు 9న సెల్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఆరోజున సైతం వారి సమస్యలకు పరిష్కారం ప్రభుత్వం చూపనట్లయితే తమ ఆందోలన తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టి తమ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. గతంలో పలుమార్లు చర్చలు జరిపినా యాజమాన్యాలు తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో సమ్మెకు దిగడం తప్ప మరోక మార్గం లేదని భావించి గురువారం నోటీసులు ఇచ్చారు. తమ సమ్మెతో సమస్యలు వస్తాయని, పరిశ్రమలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని కనుక చర్చల ద్వారా పరిష్కరించడం సరైన విధానమని విద్యుత్ ఉద్యోగుల ఐకాస చెబుతోంది. 
Also Read: CM Jagan: లోకేష్‌పై మొదటి సారి రియాక్ట్ అయిన జగన్. బాలకృష్ణను కూడా వదల్లేదు !


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial