CM Jagan:  వెంకటగిరిలో నిర్వహించిన  నేతన్న  హస్తం పథకం  బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్మోహన్ రెడ్జి ఇతర నేతలపై చేసిన వ్యక్తిగత విమర్శలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ పైనే సీఎం జగన్ విమర్శలు చేసేవారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని..  నిత్య పెళ్లికొడుకు అని విమర్శలు చేస్తూ ఉండేవారు. వెంకటగరిలో అలాంటి విమర్శల తీవ్రతను పెంచడమే కాదు.. ఈ సారి లోకేష్, బాలకృష్ణల అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ అన్న మాటలపై విస్తృత చర్చ జరుగుతోంది. 


లోకేష్‌పై మొదటి సారి రియాక్ట్ అయిన సీఎం జగన్


నారా లోకేష్ విషయంలో సీఎం జగన్ మొదటి సారి రియాక్ట్ అయ్యారు. అదీ కూా లోకేష్ స్విమ్మింగ్ ఫూల్‌లో అమ్మాయిలతో ఉన్న ఫోటో గురించి ప్రస్తావించారు. ఈ ఫోటోను చూపించి లోకేష్ ను వైసీపీ నేతలు తీవ్రంగా  విమర్శలు గుప్పించేవారు. ఈ అంశాన్ని మొదట్లో లోకేష్ పట్టించుకోలేదు. కానీ ఆ ఫోటోను చూపించి ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూండటంతో ఇటీవల ఓ ఇంటర్యూలో దీనిపై మాట్లాారు. ఆ ఫోటో అమెరికాలో కాలేజీలో ఉన్నప్పుడు మిత్రులతో దిగిందని తాను అందరిలానే కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేశానని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఫోటోను సీఎం జగన్  ప్రస్తావించి లోకేష్ .. మహిళల్ని కించ పరుస్తాడన్న అర్థంలో విమర్శించారు.           


బాలకృష్ణపైనా విమర్శలు చేసిన సీఎం జగన్


ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా జగన్ టార్గెట్ చేశారు. గతంలో ఎప్పుడూ బాలకృష్ణపై విమర్శలు చేయలేదు. కానీ వెంకటగిరిలో మాత్రం బాలకృష్ణ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. చాలా ఏళ్ల క్రితం  బాలకృష్ణ ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదం అవడంతో .. తాను ఆ మాటలు అన్న ఉద్దేశం వేరని.. అన్న సందర్భాన్ని ప్రస్తావించకుండా తప్పుడు ప్రచారం చేశారని వివరణ ఇచ్చారు. మహిళా లోకానికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ మాటల్ని జగన్ మోహన్  రెడ్డి వినిపించారు. ఆయన కూడా మహిళల్ని  కించపరుస్తారన్నట్లుగా మాట్లాడారు.            


సీఎం జగన్ అసహనానికి గురవుతున్నారా ?


సీఎం జగన్ పాల్గొన్నది రాజకీయసభ కాదు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభ, నేతన్నల గురించి ఏర్పాటు చేసిన సభ. అందులో రాజకీయాలు మాట్లాడటమే ఆశ్చర్యం అయితే .. ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం.. టాపిక్‌తో సంబంధం లేని వారిపైనా ఇతర విషయాలను చూపించి ఆరోపణలు చేయడం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. సీఎం జగన్‌లో అసహనం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్, బాలకృష్ణలపైనా విమర్శలు చేయడం.. జగన్ ప్రస్తావించిన అంశాలు కూడా ఏళ్ల కిందటివి అయినప్పటికీ.. వాటిని గుర్తు చేసి వారు చెడ్డ వ్యక్తులన్నట్లుగా ప్రచారం చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.