Congress Leaders House Arrested Due to Chalo Secratariat: ఏపీ ప్రభుత్వం దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో సెక్రటేరియట్' (Chalo Secratariat) నిరసన గురువారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. విజయవాడ (Vijayawada) ఆంధ్ర రత్న భవన్ లో షర్మిల ఉన్న చోటకు గురువారం ఉదయం చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆమెను ఆ భవన్ లోనే నిర్బంధించారు. ఆమె బయటకు రాకుండా భారీగా మోహరించారు. దీంతో పార్టీ అభిమానుల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మస్తాన్ వలి, తులసిరెడ్డి, రుద్దరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు ఆంధ్ర రత్న కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. షర్మిల అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. 'వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్ట్ చేస్తున్నారు. 23 వేల పోస్టుల భర్తీ అని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు.' అని షర్మిల తీవ్రంగా మండిపడ్డారు.
మీకు అవమానం కాదా.?
కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, అరెస్టులపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు.? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోనే గడపాలా.? నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా.? మేము తీవ్ర వాదులమా.? సంఘ విద్రోహ శక్తులమా.? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించిన నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదు.' అని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
'ఛలో సెక్రటేరియట్' లో పాల్గొనేందుకు షర్మిల బుధవారం సాయంత్రమే విజయవాడ చేరుకుని పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లోనే బస చేశారు. అయితే, ఆమె బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో బస చేయాల్సి ఉండగా.. ముందస్తు అరెస్టుల నేపథ్యంలో ఆమె ఆంధ్ర రత్న భవన్ లోనే ఉండిపోయారు.
ఛలో సెక్రటేరియట్ నిర్వహించి తీరుతాం
రాత్రి నుంచి పోలీసుల దమన కాండ కొనసాగుతోందని.. అక్రమంగా కేసులు పెడతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఛలో సచివాలయం నిర్వహించిన తీరుతామని.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే షర్మిల దీక్ష చేస్తారని స్పష్టం చేశారు.