Kuwait Victim man Viral Video: కువైట్‌లో తాను పడరాన్ని పాట్లు పడుతున్నానని ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఓ సెల్ఫీ వీడియోలో వాపోయిన సంగతి తెలిసిందే. తాను బతుకుదెరువు కోసం కువైట్ వచ్చానని, ఓ ఏజెంట్ చేతిలో మోసపోయానని బాధితుడు ఆ వీడియోలో వాపోయాడు. తాను అక్కడ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కూడా శివ అనే వ్యక్తి వివరించారు. తనను ఒక ఎడారి ప్రాంతంలో వదిలేశారని, అక్కడ కుక్కలు, బాతులకు ఆహారం పెట్టడమే తన పని అని చెప్పుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదని, కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని చెప్పారు. తన యజమానులు కూడా తనను పట్టించుకోవడం మానేశారని వివరించాడు.


ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. బాధితుడిని రక్షిస్తామని భరోసా ఇచ్చారు. విదేశాంగ శాఖ సాయం చేయాలని.. అలాగే బాధితుడిని గుర్తించి సాయం చేయాలని ఎన్నారై టీడీపీ విభాగానికి సూచించారు. అనంతరం రెండు రోజులకే బాధితుడ్ని రక్షించగలిగారు.


తాజాగా నారా లోకేశ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేస్తూ.. శివ అనే కువైట్ బాధితుడు ప్రస్తుతం ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీలో సేఫ్ గా ఉన్నాడని తెలిపారు. త్వరలోనే అతణ్ని ఏపీకి రప్పిస్తామని వెల్లడించారు. ఈ మేరకు శివ మాట్లాడిన ఓ వీడియోను కూడా  నారా లోకేశ్ పోస్ట్ చేశారు.


‘‘నా పేరు శివ. మాది రాయలసీమలోని నంద్యాల. కువైట్‌కు బతకడానికి వస్తే.. ఇక్కడ బతుకే కష్టమైపోయింది. నిన్న ఎంబసీ వాళ్లు నాకు కాల్ చేశారు. వాళ్లే నన్ను ఎంబసీకి తీసుకొచ్చారు. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాను. నేను భారత్ వెళ్లే వరకూ ఉండడానికి, తినడానికి ఏ ఇబ్బంది ఉండదని సార్ వాళ్లు చెప్పారు. క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నాదే అని చెప్పారు. నన్ను కాపాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని బాధితుడు శివ తెలిపారు.