Nagababu On Ysrcp : వైసీపీలో ఓదార్పుల పర్వం మొదలైంది. మంత్రి పదవులు రాకపోవడంతో పలువురు నేతలు అలిగారు మరికొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మాజీ మంత్రి బాలినేనిని ప్రభుత్వ సలహాదారు ఏకంగా మూడుసార్లు కలిసి బుజ్జగించారు. చివరికి సీఎం జగన్ తో భేటీ కావాలని కోరారు. మాజీ హోంమంత్రి సుచరిత అయితే మరో అడుగు ముందుకేసి రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే మంత్రి పదవులు దక్కలేదని మీరే ఇంత బాధపడితే మరి వాళ్లేంత బాధపడాలని జనసేన నేత, సినీనటుడు నాగబాబు వైసీపీ నేతలకు చురకలు అంటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు.
పేదల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తే బాగుండేది
మంత్రి పదవులు దక్కలేదని ఫ్రస్ట్రేషన్, బాధ, కుమిలి పోవడం, కొందరైతే కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే చాలా బాధ అనిపించిందని నాగబాబు అన్నాయి. అయితే కౌలు రైతుల ఆత్మహత్యలు, ఇతర ఉత్పత్త కులాలలో చనిపోయిన ప్రజలు, ఉద్యోగ అవకాశాలు లేక యువత, రాజధాని రైతులు, ఉద్యోగులుపడుతున్న బాధలు, నిత్యం పలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు వీళ్ల బాధలు చూసి ఈ నేతలకు ఇదే కన్నీరు, ఫ్రస్ట్రేషన్, బాధ, కుమిలి పోవటం వస్తే బాగుండేదన్నారు. వారి పట్ల ప్రేమ చూపించి, కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తే ఇంకా బాగుండేది అని వైసీపీ నేతలకు చరకలు అంటించారు. చివర్లో ఏమంటారు వైసీపీ లీడర్స్ అని ప్రశ్నలు సంధించారు.
వైసీపీలో మంత్రి పదవుల రచ్చ
వైసీపీలో జగన్ ఎంత చెబితే అంత! ఆయన మాటకు తిరుగులేదు. మంత్రి పదవుల్ని ప్రకటించే వరకూ ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా అసంతృప్తే కనిపిస్తోంది. ప్రతి పార్టీలోనూ అసంతృప్తి సహజం. ఎందుకంటే అన్ని అవకాశాలూ అందరికీ ఇవ్వలేరు. కానీ వాటిని ఆశించేవారు ఎక్కువ మందే ఉంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి వేరు. ఆ పార్టీలో అసంతృప్తి ఉన్నా బయటపడుతుంది అని ఎవరూ అనుకోలేదు. రోడ్డెక్కుతారని రాజీనామాల వరకూ వెళ్తారని భావించలేదు. కానీ ఇక్కడ బాలినేని శ్రీనివాస రెడ్డి, సుచరిత వంటివాళ్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. తమకు ఎమ్మెల్యే పదవులు కూడా వద్దంటున్నారు. చాలా చోట్ల నేతలు మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. తలుపుకుని వేసుకుని ఏడుస్తున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అభిమానులు. అనుచరులు రోడ్లపైకి వచ్చి చేస్తున్న రచ్చతో వారి అసంతృప్తి వెల్లువెత్తుతోంది.