Vangalapudi Anitha Comments: ఏపీలో శాంతి భద్రతలకు (లా అండ్ ఆర్డర్) ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని హోం మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణన లోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 


మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ, విద్యా, పోలీసు శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కు కమిటీని నియమించి, విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులకు కూడా అత్యాచారాలకు ఆస్కారం ఉన్న కారణాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనిత తెలిపారు.


కొన్ని ప్రభుత్వ వ్యతిరేక అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. చంద్రబాబు హాయాంలో శాంతిభద్రతలు ఏరకంగా అదుపులో ఉంటాయో ప్రజలకు తెలుసని అన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలను అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన తీరును అనిత గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతును ఓర్చుకోలేకనే ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


మాజీ సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన చెందుతూ పలువురికి లేఖలు రాస్తున్నారని.. రాష్ట్రపతికి, హోంమంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డాక్టర్ సుధాకర్ హత్యలను కూడా ప్రస్తావించాలని అనిత ఎద్దేవా చేశారు. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసుతో పాటు వివిధ ఘటనలను కూడా ఆ లేఖలో పేర్కొనాలని ఎగతాళి చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోందని అన్నారు. గతంలో దిశా యాప్‌ను మగ వాళ్లతోనూ డౌన్‌లోడ్‌ చేయించారని హోంమంత్రి అనిత విమర్శించారు. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యాశాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని అన్నారు.


కొంగ జపాలు చాలు - వైసీపీ
ఏపీలో శాంతి భద్రతలపై వైఎస్ఆర్ సీపీ విమర్శలను మరింత పెంచింది. రాష్ట్రంలో వినుకొండలో జరిగిన హత్య, పుంగనూరులో ఉద్రిక్తతలు, పలుచోట్ల అత్యాచారాల ఘటనలతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ ఆరోపిస్తోంది. ‘‘లా అండ్ ఆర్డర్‌ని గాలికొదిలేసి శాంతి భద్రతలపై శ్వేతపత్రమా చంద్రబాబు? జూన్ 4 నుంచి రాష్ట్రంలో ప్రజలకి కొరవడిన శాంతి.. ఆడబిడ్డలకి దొరకని భద్రత.. నెలన్నరలో పూర్తిగా గాడితప్పిన లా అండ్ ఆర్డర్. శ్వేత పత్రాలతో బురద చల్లేందుకు నువ్వు పెడుతున్న శ్రద్ధలో కనీసం 10% లా అండ్ ఆర్డర్‌ పరిరక్షణపై పెట్టినా రాష్ట్రం ఇలా రావణకాష్టంగా మారేదా? చేసిన కొంగ జపాలు చాలు చంద్రబాబు.. ఇకనైనా పాలనపై దృష్టి పెట్టు’’ అని వైఎస్ఆర్ సీపీ ఎక్స్‌లో పోస్టు చేసింది.