AP High Court Lifted Stay on Rajadhani Files: 'రాజధాని ఫైల్స్' (Rajadhani Files) సినిమా విడుదలకు అడ్డంగులు తొలగిపోయాయి. ఏపీ హైకోర్టు (AP High Court).. సినిమా విడుదలపై స్టే ఎత్తేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకే అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేస్తూ.. చిత్రం విడుదల చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 


ఇదీ జరిగింది


సీఎం జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్ సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపేయాలని గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కోర్టు తీర్పు వెలువడగానే పలు చోట్ల పోలీసులు రెవెన్యూ అధికారులు సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్ధంతరంగా షో నిలిపివేశారు. మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపేయగా రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్‌ వద్ద  ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది. 


వైసీపీ తరఫు లాయర్ల వాదన ఇదీ


'రాజధాని ఫైల్స్‌' పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమేనని వైసీపీ తరఫు లాయర్లు వాదించారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైఎస్సార్‌సీపీని చులకన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాల్జేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు. ఈ నెల 5న రాజధాని ఫైల్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్‌ వివరించారు. చిత్ర నిర్మాతలు తమ స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీని బలి పశువును చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడూ కూడా పరిమితులకు లోబడి ఉంటుందని వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చిత్ర నిర్మాతలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంత మాత్రం సరికాదన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజధాని ఫైల్స్‌ చిత్ర ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని వైసీపీ తరపు న్యాయవాదులు వాదించారు.


ఇరవర్గాల వాదనలు విన్న హైకోర్టు సీబీఎఫ్ సీ నిబంధనల మేరకే అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని పేర్కొంటూ సినిమా విడుదలపై స్టే ఎత్తేసింది.


Also Read: Lavu Krishnadevarayalu : చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ, త్వరలో తెలుగుదేశం పార్టీలోకి