Andhra Pradesh Politics : నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Mp Lavu Krishnadevarayalu) త్వరలో తెలుగుదేశం పార్టీ (Telugu desam Party)లో చేరనున్నారు. ఉండవల్లి (Undavalli)లోని చంద్రబాబు (Chandrababu)నివాసానికి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు... టీడీపీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఆమోదించాల్సి ఉంది. టీడీపీ కండువా ఎప్పుడు కప్పుకునేది రెండు మూడ్రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని వార్డు కౌన్సిలర్లతో పాటు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు...లావు శ్రీకృష్ణదేవరాయలుతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. 


నర్సరావుపేట పార్లమెంట్ సీటు కావాలని పట్టు...కుదరదన్న జగన్
నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ భావించింది. లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. దీనికి ఆయన ససేమిరా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కే డైరెక్ట్ గా నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికే గుంటూరు నుంచి పోటీ చేయలేనని చెప్పడం...నర్సరావుపేట సీటే కావాలని పట్టుబట్టడం వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయంచడం లావు శ్రీకృష్ణదేవరాయలుకు మింగుడు పడలేదు. తన అభిప్రాయాలతో సీఎం కన్విన్స్‌ కాలేదంటూ వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఐదేళ్లలో నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు. 


2019లో తొలిసారి ఎంపీగా గెలుపు
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు...తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఈ సారి గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో...పోటీ చేసేందుకు నిరాకరించారు. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని...గుంటూరుకు మారేది లేదని తెగేసి చెప్పారు. వైసీపీ నర్సరావుపేట టికెట్ ఇవ్వకపోవడంతో...ఆ పార్టీకి రాజీనామా చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చవద్దంటూ పల్నాడు జిల్లాకు చెందిన నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డిలు అధిష్ఠానాన్ని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 


బీసీలకు కేటాయించిన సీఎం జగన్
నర్సరావుపేట పార్లమెంట్ సీటును బీసీ నేతకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండటంతో...ఆ సామాజికవర్గం నేతలను పోటీ చేయిస్తే గెలపు సులభం అవుతుందని సీఎం జగన్ లెక్కలు వేసుకున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ చార్జ్ గా నియమించింది. ఇప్పటికే అనిల్ కుమార్...నర్సరావుపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టికెట్ దక్కని నేతలు...సిట్టింగ్ స్థానం కాదని మరో చోట టికెట్ ఇచ్చిన నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అధికార పార్టీకి గుడ్ బై చెప్పి...తెలుగుదేశం పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. రేపో మాపో టీడీపీ జెండా కప్పుకోనున్నారు.