AP High Court : ఆస్తి పన్ను(Property Tax) వ్యవహారంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్(Nellore Municipal Corporation) అధికారుల తీరుపై హైకోర్టు(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరును తప్పుబట్టింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఏదో పని ఒత్తిడిలో ఇచ్చామని అధికారులు చెప్పడంపై ధర్మాసనం మండిపడింది. అధికారులు తమ పరిధి దాటి వ్యవహరించారని కోర్టు భావించింది. ఎలాంటి అధికారం లేకుండా బలవంతంగా ఆస్తి పన్ను వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  


అధికారుల తీరు రాజ్యాంగ విరుద్ధం 


ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించి, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నించారని హైకోర్టు ఆక్షేపించింది. అధికారుల తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదని తెలిపింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారని హైకోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్‌ నుంచి వసూలు చేసిన రూ.34.12 లక్షల మొత్తానికి 24 శాతం వడ్డీతో రెండు వారాల్లో తిరిగి చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌(Municipal Commissioner)ను ఆదేశించింది. దీంతోపాటు పిటిషనర్‌కు రెండు వారాల్లో రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించి ఆ రుజువులను హైకోర్టు రిజిస్ట్రార్‌ సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. 


అసలేం జరిగింది? 


నెల్లూరు(Nellore) పట్టణంలోని ట్రంక్‌ రోడ్డులో ఓ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను వివాదంపై విజయలక్ష్మి అనే యజమాని 2012లో నెల్లూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు పెంచిన ఆస్తి పన్ను మొత్తాన్ని రద్దు చేసింది. పాత పన్నులో  50 శాతం మాత్రమే పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అప్పటికే విజయలక్ష్మి ఆస్తి పన్ను చెల్లించడంతో అధికంగా అధికంగా వసూలు చేసిన  మొత్తాన్ని విజయలక్ష్మి భవిష్యత్తులో చెల్లించే ఆస్తి పన్నులో సర్దుబాటు చేయాలని సివిల్ జడ్జి కోర్టు ఆదేశించింది. దీనికి అధికారులు కూడా భవిష్యత్తులో కట్టే పన్నులో సర్దుబాటు  చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కార్పొరేషన్ అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. విజయలక్ష్మికి కార్పొరేషన్ రూ.13.71 లక్షలను వాపసు చేయాల్సి ఉంది.


కోర్టు ఆదేశాలు పాటించడంలో నిర్లక్ష్యం 


మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఫిబ్రవరి 19న మరోసారి రూ.34.12 లక్షల పన్ను చెల్లించాలని విజయలక్ష్మికి నోటీసులు పంపించారు. అంత మొత్తం ఎందుకు చెల్లించాలో ఎటువంటి కారణం నోటీసులో పేర్కొలేదు. విజయలక్ష్మి సివిల్‌ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కార్పొరేషన్‌ అధికారులకు చూపించినా పట్టించుకోకుండా విజయలక్ష్మికి చెందిన షాపును సీజ్‌ చేశారు. రూ.34.12 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేసి పన్ను కట్టించుకున్నారు. దీంతో విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషిన్ పై న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు విచారణ చేసి తీర్పు ఇచ్చారు.