ఉపాధి హామీ పథకం బకాయిలు కాంట్రాక్టర్లకు చెల్లించాలనే పిటిషన్లపై విచారణ పూర్తయ్యేంత వరకూ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, హరీష్ హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం నిధులకు చెల్లించిన నిధుల వివరాలతో పంచాయతీరాజ్, ఆర్థికశాఖ ఉన్నతాధికారులైన ద్వివేదీ, రావత్ కోర్టుకు హాజరయ్యారు. వివరాలను కోర్టుకు సమర్పించారు. పెండింగ్‌ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని హైకోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని ఖండించారు. 


రూ. 400 కోట్లు  పంచాయతీల ఖాతాల్లో జమ చేశారని కాంట్రాక్టర్లకు చెల్లించలేదన్నారు.  నగదు నేరుగా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని వారు ధర్మాసనం దృష్టికితీసుకెళ్లారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించి ఆ వివరాలు తమకు చెప్పాలని అధికారులను హైకోర్టు ఉన్నతాధికారులను  ఆదేశించింది. హైకోర్టు గతంలో ఆదేశించడంతో  ఉపాధి బిల్లుల్లో కొంతమేర ప్రభుత్వం విడుదల చేసింది. చెల్లించాల్సిన మొత్తం రూ.1,900 కోట్లు. అందులో రూ. 400 కోట్లు గ్రామ పంచాయతీ ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. కానీ కాంట్రాక్టర్లకు చెల్లించలేదు. దీనిపైనే హైకోర్టు ప్రశ్నించింది. 


విచారణ సందర్భంగా ఇక నుంచి జరిగే విచారణకు  తమకు హాజరు నుంచి మినహాయింపు కావాలని అధికారులు కోరారు. అయితే హైకోర్టు మాత్రం విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు కోర్టులోనే ఆరోపణలు చేసుకున్నారు. కేంద్రం నుంచి నిధులు రావాలని ఏపీ  .. లేదు బకాయిలన్నీ ఇచ్చేసిందని కేంద్రం ఇచ్చేసిందని కేంద్రం తరపు లాయర్లు వాదించారు. ఎవరెవరు ఎంతెంత చెల్లించారన్న అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 


సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్లకు రెండు వారాల్లో బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. చేసిన పనులకు బిల్లులు పొందే చట్టబద్ధమైన హక్కు పిటిషనర్లకు ఉందని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో చెల్లింపుల వివరాలు లేకపోవడంపై  హైకోర్టు ప్రశ్నించడంతో అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని తెలిపారు. ఉపాధి హామీ నిధుల అంశం హైకోర్టలో ఏడాదిన్నరగా విచారణ జరుగుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తామంటోంది కానీ ఏదో ఓ కారణం చెబుతోంది. పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు మూడేళ్లగా నిధులు చెల్లించకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయిస్తున్నారు.