CRDA Innar Ring Road CID Case :  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులో జూన్ 9వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశిచింది. చంద్రబాబును ఏ వన్‌గా నారాయణ ఏ - 2గా సీఐడీ కేసు నమోదు చేశింది.  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార ఎజెండాతో క్రిమినల్ కేసుల్లో ఇరికించి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ..వారి ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ ముందస్తు బెయిల్   కోసం మాజీ మంత్రి నారాయణతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఏ - 1 గా ఉన్న చంద్రబాబు మాత్రం ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. 


2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం ప్రతిపాదనను పక్కన పెట్టింది. దీనికోసం అంగుళం భూమి కూడా సేకరించలేదు.  కొందరికి లబ్ధిచేకూర్చేలా వ్యవహరించి, మరికొందరికి నష్టం చేశామనే ప్రశ్నే ఉత్పన్నం కాదని నారాయణ తరపు న్యాయవాది వాదించారు.  అమరావతి మా స్టర్‌ ప్లాన్‌ రూపకల్పన వ్యవహారాన్ని సీఆర్డీఏ 2015 ఆగస్టు 28న సింగపూర్‌ కంపెనీ సుర్బానా-జురాంగ్‌ సంస్థకు అప్పగించింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో 6 సంవత్సరాల 8 నెలల అసాధారణ జాప్యం తరువాత ఇప్పుడు ఫిర్యాదు చేశారని... జాప్యానికి గల కారణాలను ఫిర్యాదులో పేర్కొనలేదన్నారు.  చట్ట విరుద్ధంగా ప్రతిఫలం పొందారని ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదన్నారు. 


ఈ నేపథ్యంలో సెక్షన్‌ 120 (బీ), సెక్షన్‌ 420, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు  పిటిషనర్‌కు వర్తించవని నారాయణ తరపు న్యాయవాది వాదించారు.  ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కక్షసాధించాలని, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాలనే దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయ స్థానం వచ్చే నెల 9వ తేదీ వరకు వీరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  


పేపర్ లీకేజీ కేసులో హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేసిన రోజున  ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించి సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో సీఐడీ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే పోలీసులు ఏ అర్థరాత్రో వచ్చి అరెస్ట్ చేసే ప్రమాదం ఉన్నందున.. అందులో ఉన్న వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టు వచ్చే నెల తొమ్మిది వరకూ రిలీఫ్ ఇచ్చింది.