AP High Court On YCP offices Demolition : వైఎస్ఆర్‌సీపీ ఆఫీసుల కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రతి దశలోనూ వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది.  2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీని న్యాయస్థానం ఆదేశించింది. తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.  ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా  ఉన్న సమయంలోనే  కూల్చివేత ఆలోచన చేయాలని సూచించింది.


అనుమతుల్లేకుండా వైసీపీ కార్యాలయాల నిర్మాణం                         


ఏపీలో వైసీపీ ఇరవై ఆరు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించింది. అన్నిచోట్లా ప్రభుత్వ భూముల్ని లీజుకు తీసుకున్నారు. ఎకరానికి వెయ్యి చొప్పున ముప్ఫైమూడేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అక్కడ కార్యాలయాలు నిర్మించారు. అయితే ఒక్క ఒంగోలు జిల్లా కార్యాలయానికి తప్ప మరే కార్యాలయానికి అనుమతలు తీసుకోలేదు. ప్రభుత్వం వైసీపీదే ఉండటంతో గతంలో పట్టించుకోలేదు. దీంతో   16 వైసీపీ కార్యాలయాలను అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు. 


మంగళగిరిలో వైసీపీ ఆఫీసు కూల్చి వేత                            


తాడేపల్లిలోని సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు  కూల్చేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని.. బోట్ యార్డుగా ఉపయోగించే స్థలాన్ని అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి తక్కువ లీజుకే కట్టబెట్టారని అందుకే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలా అనుమతులు లేకుండా మరిన్ని కార్యాలయాలు సైతం నిర్మిస్తున్నారని.. వాటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సరైన వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో మిగతా కార్యాలయాలను కూడా కూల్చివేస్తారన్న ఉద్దేశంతో  ప్రభుత్వ ఉత్తర్వులపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం స్టేటస్ కో విధించింది. విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పు ప్రకటించింది.  


రెండు నెలల తర్వాత కూల్చివేత నిర్ణయం తీసుకుంటారా ?


అనుమతుల్లేని నిర్మాణాలు కాబట్టి కూల్చివేయవద్దని హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వలేదు. చట్ట  ప్రకారమే వ్యవహరించాలని ఆదేశించింది. అన్ని అనుమతులు చూపించడానికి రెండు నెలల గడువు ఇచ్చింది. అయితే నిర్మాణం పూర్తయిన తర్వాత అనుమతులు ఇవ్వరు. అనుమతులు తీసుకునే నిర్మించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వైసీపీ పార్టీ ఆఫఈసుల్ని రెండు నెలల తర్వాత కూల్చి వేసే చర్యలు చేపడతారని అంచనా వేస్తున్నారు.