Ap Government Key Orders on Pension Distribution: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ (Pension Distribution) చేయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్థతపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సచివాలయాలకు వెళ్లి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లి పెన్షన్ తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3 నుంచి సచివాలయాల్లో పెన్షన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.


ఈసీ కీలక ఆదేశాలు


కాగా, ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని శనివారం కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. పింఛన్ మాత్రమే కాదు, ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాకుండా, ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్స్, మొబైల్స్ ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ సహా అమల్లో ఉన్న ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. లేకపోతే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈసీ పేర్కొంది. వాలంటీర్ల పని తీరుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల కొందరిని అధికారులు విధుల నుంచి సైతం తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్లను నగదు పంపిణీ ప్రయోజనాలకు దూరంగా ఉంచేలా ఈసీ చర్యలు చేపట్టింది.


అటు, వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స మండిపడ్డారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల సైతం టీడీపీపై విమర్శలు గుప్పించారు.


సీఎస్ కు చంద్రబాబు లేఖ


మరోవైపు, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లపై ఈసీ ఆదేశాలతో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛను అందించాలని అన్నారు. గ్రామ, సచివాలయ సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సకాలంలో పింఛన్ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం ఆయన లేఖ రాశారు. పింఛన్ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సీఈవోను కోరారు.


Also Read: Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్ - ఇంకా 2 స్థానాల్లో పెండింగ్, పిఠాపురంలో పవన్ రెండో రోజు పర్యటన