Randeep Hooda About Oscar Winning Movie Oppenhemier: బాలీవుడ్ న‌టుడు ర‌ణదీప్ హుడా డైరెక్ట్ చేసి, న‌టించిన సినిమా ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’.  ఈ మ‌ధ్యే రిలీజైన ఈ సినిమా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ  పొందింది. పీరియాడియకల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాని తెరకెకెక్కించారు. స్వ‌తంత్ర్య స‌మ‌ర‌యోధులు వినాయ‌క దామోద‌ర్ సావ‌ర్క‌ర్ జీవితం ఆధారంగా ఈ  సినిమా తీశారు. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ర‌ణదీప్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న సినిమా గురించి చెప్తూనే ఇటీవ‌ల ఇచ్చిన ఆస్కార్ అవార్డులు గురించి మాట్లాడారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న  ‘ఓపెన్‌హైమర్’ సినిమాపై, అమెరిక‌న్ న‌టీన‌టుల‌పై కామెంట్స్ చేశారు. అమెరిక‌న్లు ప్రాప‌గాండా సినిమాలు చేస్తార‌ని ఆయ‌న అన్నారు. 


అదొక ప్రాప‌గాండా సినిమా.. 


మ‌న దేశంలోని నిజ‌మైన, గొప్ప హీరోల‌ను మ‌నం త‌క్కువ చేసి చూసుకుంటామ‌ని, అమెరిక‌న్లు ప్రాప‌గాండా చేసి సినిమాలు తీస్తే.. వాళ్ల‌ను హీరోల్లా భావిస్తామ‌ని ఆయ‌న ఆవేదన వ్య‌క్తం చేశారు. " ప్రాప‌గాండా సినిమాలు చేస్తారు. వాళ్ల సినిమాల్లో వాళ్ల‌ను హీరోలుగా చూపించుకుంటారు. ‘ఓపెన్‌హైమర్’  సినిమాలో అత‌ను ఆట‌మ్ బాంబ్ ను త‌యారు చేస్తాడు. ఆ బాంబ్ ని జ‌పాన్ లోని అమాయ‌కుల‌పై వేస్తారు. అది చాలా బాధాక‌ర‌మైన విష‌యం. అది కూడా రాత్రిపూట దాడి చేస్తారు. అలాంటి వాళ్లు మంచివాళ్లు. బాంబు వేసిన అమెరికా మంచిది. వాళ్ల సినిమాల‌న్నీ ప్రాప‌గాండ‌తో కూడుకున్న‌వి. త‌మ ద‌గ్గ‌ర బెస్ట్ ఆర్మీ ఉంది. తామే మంచివాళ్లం. జ‌పాన్, జ‌ర్మ‌నీ మంచివి కావు అని చెప్పుకునేలా వాళ్ల సినిమాలు ఉంటాయి. హిస్ట‌రీలో కూడా అదే ఉంటుంది. ఆ హిస్ట‌రీ నిజం కాదు. వాళ్లు ఓపెన్‌హైమర్, ట్రూమెన్ లాంటి వాళ్ల మీద సినిమాలు తీస్తారు. వాళ్లను హీరోల్లా భావించి మ‌నం కూడా ఆ సినిమాలు చూస్తాం. ఇక మ‌న దేశంలో మ‌న హీరోల‌ను మ‌నం త‌క్కువ చేసుకుంటాం. కార‌ణం రాజ‌కీయాలు” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ర‌ణదీప్ హుడా. 


96వ ఆస్కార్ అవార్డులలో 13 కేటగిరిల్లో స్థానం దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ‘ఓపెన్‌హైమర్’. ఆస్కార్స్ కంటే ముందే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఈ సినిమా సొంతమయ్యాయి. లండన్‌లోని బఫ్తా ఫిల్మ్ అవార్డులలో ఏడు కేటగిరిల్లో విన్నర్‌గా నిలిచింది ‘ఓపెన్‌హైమర్’. ఇక 2024లోని క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో కూడా 8 పురస్కారాలను గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్‌లో సైతం అయిదు నామినేషన్స్‌తో పోటీపడగా.. అందులో అయిదు అవార్డులను గెలుచుకుంది. 


‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’  సినిమా విష‌యానికి వ‌స్తే.. రణదీప్ హుడా తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా కోసం ర‌ణ దీప్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు త‌గ్గారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా తనను తాను మార్చుకున్నారు. సినిమా షూటింగ్‌ ముందు ఆయన 86 కేజీలు ఉంటే ఈ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గారు.  బరువు తగ్గేందుకు రోజూ ఒక ఖర్జూర పండు, 1 గ్లాస్‌ పాలు మాత్రమే తీసుకున్నట్లు వివరించారు.  అంత డెడికేష‌న్ తో ఈ సినిమా తెర‌కెక్కించారు ర‌ణ‌దీప్ హుడా.  


Also Read: నితిన్ బర్త్‌డే అప్‌డేట్స్, సందీప్ కిషన్ ‘వైబ్’ ఫస్ట్‌లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!