Pawan Kalyan Announced Visakha South Contestant: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan) మరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. విశాఖ దక్షిణం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా సీహెచ్ వంశీకృష్ణ యాదవ్ పేరును జనసేనాని ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ప్రస్తుతం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆయన పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం, బహిరంగ సభల ప్రణాళికలు వంటి వాటిపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణం అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించారు. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకూ 19 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇంకా అవనిగడ్డ, పాలకొండ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అసెంబ్లీ అభ్యర్థులు
☛ పిఠాపురం - పవన్ కల్యాణ్
☛ తెనాలి - నాదెండ్ల మనోహర్
☛ నెల్లిమర్ల - లోకం మాధవి
☛ అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
☛ కాకినాడ రూరల్ - పంతం నానాజీ
☛ రాజానగరం - బత్తుల రామకృష్ణ
☛ నిడదవోలు - కందుల దుర్గేష్
☛ పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
☛ యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్
☛ పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
☛ రాజోలు - దేవ వరప్రసాద్
☛ తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
☛ భీమవరం - పులపర్తి ఆంజనేయులు
☛ నరసాపురం - బొమ్మిడి నాయకర్
☛ ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
☛ పోలవరం - చిర్రి బాలరాజు
☛ తిరుపతి - ఆరణి శ్రీనివాసులు
☛ రైల్వేకోడూరు - డా.యనమల భాస్కరరావు
☛ విశాఖ దక్షిణం - వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
లోక్ సభ అభ్యర్థులు
☛ మచిలీపట్నం - వల్లభనేని బాలశౌరి
☛ కాకినాడ - తంగెళ్ల ఉదయ శ్రీనివాస్
పిఠాపురంలో పవన్ పర్యటన
మరోవైపు, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుహూతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీ దేవీ, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభునికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
అటు, తొలి రోజు పిఠాపురంలో 'వారాహి విజయభేరి' సభలో పవన్ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకార పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని.. కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం సీటును త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జీ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. ఇక్కడ లక్ష మెజారిటీతో గెలపిస్తా అన్నారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని అన్నారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.