Botsa Satyanarayana - విశాఖపట్నం: వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలి అంటారు. కానీ అబద్ధాలతో బంధాలు నిలవవు అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తును ఉద్దేశించి ఈ సెటైర్లు వేశారు. బీజేపీ ఆహ్వానిస్తేనే తాము వెళ్లి పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెబుతారని, ఆపై అందులో నిజం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రజా ఆగ్రహానికి గురైన వారికి, నోరు అదుపులో పెట్టుకోలేక పోయిన వారికి మాత్రమే బ్లాక్ డ్రెస్ వాళ్ల సెక్యూరిటీ అని నారా లోకేష్ కు జడ్ కేటగిరి సెక్యూరిటీపై సైతం బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్కస్ వాళ్ల లాగ డ్రామాలు చేయడానికి ఈ తెలివి పనికొస్తుందన్నారు. 


లోకేష్‌కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఎందుకు? 
మంత్రి బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, తన కొడుకు రక్షణ కోసం, లోకేష్ జెడ్ కేటగిరి సెక్యూరిటీ కోసం బీజేపీ కూటమిలో చేరారు తప్ప.. ప్రజలు కోసం కాదన్నారు. తనకు గన్ మ్యాన్ కూడా ఇవ్వలేదు.. నాకు ఎందుకు.. నేనేం తప్పు చేస్తే అంత సెక్యూరిటీ అవసరం అవుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలకు పటిష్ట భద్రత ఇవ్వవచ్చు, కానీ లోకేస్ కు ఇంత సెక్యూరిటీ ఎందుకో చెప్పాలన్నారు. ఉమ్మడి ఏపీ కి అధ్యక్షుడు గా పని చేశా.. జనం విపరీతంగా వచ్చారు. అప్పుడు కూడా తాను భద్రత అడగలేదని గుర్తుచేశారు. మరోవైపు వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రచేసి పేదలకు పెన్షన్‌ అందకుండా చేస్తున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పేదవాడికి అందకుండా చేసి, వైసీపీపై దుష్ప్రచారం చేయడమే టీడీపీ రాజకీయం అంటూ ఫైర్ అయ్యారు.  


అసలే ఎన్నికల సమయం, అందులోనూ వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్‌ లాంటి సంక్షేమ పథకాల నగదు ఇకనుంచి ఎవరు అందజేస్తారని బొత్స ప్రశ్నించారు. పెన్షన్ లబ్ధిదారులు ఇప్పటికప్పుడూ బ్యాంక్ అకౌంట్ తెరిచి నగదు తీసుకోవం సాధ్యమా? టీడీపీ కుటిల రాజకీయాలు. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి ఏపీలో టెట్ ఫలితాలు అడ్డుకున్నారని, డీఎస్సీ పరీక్షను కూడా వాయిదా పడేలా చేయించారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. అవుతాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ ఎంపీ స్థానాలను బలహీన వర్గాలకే వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారని, రాష్ట్రంలో సోషల్ ఇంజినీరింగ్ కొనసాగుతోందన్నారు. 


మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెబుతాయి
‘మంచి జరిగితేనే ఓటు వేయండి అనే ధైర్యం జగన్ కు ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పగలరా?. నవ్యాంధ్ర ప్రదేశ్ లో అవకాశం ఇవ్వండి అని తీసుకుని కులానికి, ప్రాంతానికి, కుటుంబ సభ్యులకి అన్యాయం చేశావు. పేదవాడి భూములు దోపిడీ చేశారు. విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే కోర్టు కి వెళ్ళారు.. అమరావతి ప్రకటించినప్పుడు వైసీపీ నేతలు ఎవరూ కోర్టు కి వెళ్ళ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కరణ అనేది ఏపీ ప్రభుత్వం చేతిలో లేదు. ప్రధాని మోదీ సమక్షంలో మా స్టాండ్ చెప్పాం.. బీజేపీతో వైసీపీ కలిసి పోయింది అని అప్పుడు మా పై నిందలు వేసి.. ఇప్పుడు ఎవరు ఎవరితో కలిశారు. ఈ మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ కోసం ఏమి చెబుతాయి. కూటమి ప్రచారం మొదలు పెట్టే లోపలే ప్రైవేటు కరణ ఉపసంహరణ అనౌన్స్ రావాలి. లేదంటే కూటమి అభ్యర్థులు ఈ ప్రాంతం లో తిరగడానికి వీలు లేదు.


నేను కూడా చంద్రబాబు తరహాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ. సుష్మా స్వరాజ్ పార్లమెంటు లో ఏం స్పీచ్ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై కాకినాడలో ఏమి డిక్లరేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజనకి మద్దతు ఇచ్చింది ఎవరు.. ఎర్రం నాయుడు కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది టీడీపీ నేతలు చెప్పాలి. అధికారాన్ని స్వంత ప్రయోజనం కోసం వాడుకుని ఈ రోజు మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. వైఎస్సార్ ఏం చేశారో ప్రజలే చెబుతారు. ఎస్ ఈ జెడ్, ఫార్మా, ఐటీ హబ్, బ్రాండిక్స్ వంటివి వైఎస్సార్ అనేకం తెచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పేరు చెబితే నవరత్నాలు, నాడు నేడు అని చాలానే ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఖాతాలో ఏమీ లేవు’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.