Chandrababu : చట్ట విరుద్ధంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అరెస్ట్ చేశారని..  అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A తనకు వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై వచ్చే నెల మూడో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కేవియట్ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ వాదన కూడా వినాలని కోరింది. 


కేవియట్ పిటిషన్ అంటే ?                                


కేవియట్‌ పిటిషన్‌ అంటే సెక్షన్‌ 148ఏ సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పైన కోర్టులో అంటే ఏ కోర్టులో అయితే గెలుస్తారో ఆ పైన ఉండే కోర్టులో కేవియట్‌ పిటిషన్‌ వేస్తుంటారు. కేవియట్‌ అంటే కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కోర్టు ఆ కేసు ఏంటనేది వింటుంది. తదనుగుణంగా విచారణ చేసి ఇవ్వాల్సిన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది. కేవియట్‌ పిటిషన్‌ లైఫ్‌ 3 నెలలు ఉంటుంది. ఇలా కేవియట్‌ పిటిషన్‌ను ఉపయోగించుకోవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.


మూడో తేదీన చంద్రాబబు పిటిషన్ విచారణ                      


సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లు  మొదటగా ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లగా.. నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి భట్టి ప్రకటించారు. దీంతో చంద్రబాబు తరలు లాయర్  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దగ్గర మెన్షన్ చేశారు.  ఆయన పిటీషన్ ను పరిగణలోకి తీసుకుంటూ.. చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్నారు. క్వాష్ పిటీషన్ కొట్టివేయాలని.. చంద్రబాబుపై నమోదైన కేసులను కొట్టివేయాలని వాదించారు.  చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ .. కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నానని.. అక్టోబర్ 3వ తేదీన ఆ బెంచ్ వాదనలు వింటుందని తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబు కేసు వాయిదా పడినట్లు అయ్యింది. సుప్రీంకోర్టులో తర్వాత వర్కింగ్ డే ఆ రోజే. అప్పటి వరకూ సుప్రీంకోర్టుకు సెలవులుఉన్నాయి.  


ఇప్పటికే సీఐడీ వాదనలు వింటామన్న సీజేఐ                                                  


చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన సమయంలో సీఐడీ తరపు లాయర్ రంజిత్ కుమార్ ఇప్పుడు వాదనలు వింటున్నారా అని సీజేఐని ప్రశ్నించారు.  ఆ సమయంలో మీ వాదనలు కూడా వింటామని సీజేఐ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కేవియట్ దాఖలు చేసి.. తమ వాదనలు కూడా వినాలని కోరడంతో..  మూడో తేదీన సుదీర్ఘంగా వాదనలు సాగే అవకాశాలు ఉన్నాయి.