IPS ABV :  సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ఎత్తి వేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన  సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని అభిప్రాయ పడింది.


ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఆ సమయంలో  నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారని..  కొనుగోలు అంశంపై గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా వినిపించుకోలేదని ప్రభుత్వం కేసులు పెట్టింది. మొదట ఈ అభియోగాలపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అసలు పరికరాలే కొనలేదని ఇక అవినీతి అనే ప్రశ్నే రాదని ఏబీవీ వాదించారు. సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోస్టింగ్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. వెంటనే సాక్షుల్ని బెదిరించారని చెబుతూ రెండో సారి సస్పెన్షన్ వేటు వేసింది.ఇది చట్ట విరుద్ధమని ఆయన క్యాట్ ను ఆశ్రయించి అనుకూల ఫలితం తెచ్చుకున్నారు.                            


క్యాట్ తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయలేదు.  క్యాట్ తీర్పు కాపీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏబీ వెంకటేశ్వర రావు పంపించారు. పోస్టింగ్, జీతభత్యాల గురించి అందులో ప్రస్తావించారు. సీఎస్ పట్టించుకోకపోవడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున..సీఈవో కు కూడాక క్యాట్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే  సీఎం జగన్ ఆదేశాలతో క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రోజున హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఆ కేసు విచారణ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.                                        


ఏబీ వెంకటేశ్వరరావు మే 31వ తేదీన రిటైర్ కానున్నారు. డీజీ హోదాలో ఉన్న ఆయన నాలుగున్నరేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నారు. ఐదేళ్లుగా ఆయనకు ఓ పోస్టూ లేదు. ఆయన సర్వీస్ అంతా వృధా అయింది. అదే సమయంలో సస్పెన్షన్ కాలంలో జీత భత్యాలు కూడా ఇవ్వడం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు..క్యాట్ ఇలా ఏబీవీ వరుసగా న్యాయం కోసం తిరుగుతున్నారు. అన్ని చోట్లా ఊరట లభిస్తోంది కానీ.. ప్రభుత్వం మాత్రం ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం లేదు. న్యాయస్థానంలో అనుకూల ఫలితం రాకపోతే..  సస్పెన్షన్ లోనే ఉంటూ రిటైరయినట్లుగా అవుతుంది.