AP Governament To Supreme Court : జీవో నెంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన స్టే తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ జీవో చట్ట విరుద్ధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 23వ తేదీ వరకు జీవో నెంబర్ వన్ సస్పెండ్ చేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ వన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన కోర్టు ఈనెల 20వ తేదీలోగా కౌంటర్ కూడా దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు దారి జారీ చేయడమే కాక తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు కందుకూరు రోడ్ షో, ఆ తర్వాత గుంటూరులో సభలో మొత్తం 11 మంది చనిపోయారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ జారీ చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించారు. జీవో జారీ చేసిన వెంటనే ప్రతిపక్, నేత చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు ఆటంకాలు కల్పించారు. ఆయన ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రెండు రోజుల కిందట పీలేరులోనూ అడ్డుకున్నారు. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ ఉత్తర్వులు ఇచ్చారని.. బ్రిటీష్ కాలం నాటి జీవోలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
తమ సభలకు వస్తోన్న జనం, ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్ నిర్బంధాలకు తెరతీశారని టీడీపీ ఆరోపిస్తోండగా... పవన్ విశాఖ పర్యటన నుంచే ప్రభుత్వం నుంచి ఇలాంటి వైఖరి మొదలైందని జనసేన మండిపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుని కుప్పంలో పోలీసులు అడ్డుకోవడం... హైదరాబాద్ లో బాబుని కలిసి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడం... రెండు పార్టీలు కలిసి జీవో నంబర్ వన్ పై పోరాడతామని ప్రకటించారు.
అయితే సభలు, రోడ్ షోలు ఆపేందుకే జీవో తెచ్చారనేది నిజం కాదని... జీవో ద్వారా రోడ్ షో, పాదయాత్రలపై నిషేధం విధించామనే ప్రచారం అవాస్తవమని..పోలీసులు చెబుతున్నారు. సభలు, రోడ్ షోలకు అనుమతి కోరితే పరిశీలించి అనుమతి ఇస్తామ కందుకూరు, గుంటూరు ఘటనల దృష్ట్యా జీవో జారీ చేశామని పోలీసు శాఖ తరపున వివరణ ఇచ్చారు. . పోలీసు నిబంధనలు పాటించి సభలు, రోడ్ షోలు జరుపుకోవచ్చని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి కోరిన వారు పోలీసులు అడిగిన కొన్ని అంశాలపై సరైన సమాచారం ఇవ్వలేదని... అందుకే రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ వన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.