AP Filed Petition on Rajadhani Files Movie: 'రాజధాని ఫైల్స్' (Rajadhani Files) సినిమా విడుదల నిలువరించాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును (AP HighCourt) ఆశ్రయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ సినిమా తీశారని.. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై మంగళవారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య మధ్యంతర ఉత్తర్వులిచ్చే విషయమై నిర్ణయాన్ని వాయిదా వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ఈ చిత్రంలోని పాత్రలు సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించారని ఆరోపించారు. ఈ నెల 15న విడుదల కాబోతున్న 'రాజధాని ఫైల్స్' ప్రదర్శనను నిలువపిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
'ఆ సన్నివేశాలు లేవు'
చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించారు. చిత్రాన్ని పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాల తొలగింపునకు సూచించగా.. తాము రివిజన్ కమిటీ ఆశ్రయించామన్నారు. ఆ కమిటీ సూచన మేరకు కొన్ని సన్నివేశాలు తొలగించామన్నారు. గతేడాది డిసెంబర్ లో సినిమాపై సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తే వైసీపీ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడం ఏంటని అభ్యంతరం తెలిపారు. 'వ్యూహం' సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ, రోశయ్య తదితర నేతల ప్రతిష్ట దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని సీబీఎఫ్ సీ పేర్కొందన్నారు. 'రాజధాని ఫైల్స్' సినిమాలో ఎవరి ప్రతిష్టను దెబ్బతీసేలా, కించపరిచేలా ఎలాంటి సన్నివేశాలు లేవని స్పష్టం చేశారు. చిత్ర విడుదలపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని వివరించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞవత్ వాదనలు వినిపించారు. నిబంధనల మేరకు ఈ సినిమాకు ధ్రువపత్రం జారీ చేశారని, 13 సన్నివేశాలు తొలగించారని తెలిపారు.
Also Read: APPSC: ఏపీపీఎస్సీ 'గ్రూప్- 2' హాల్‌టికెట్లు విడుదల, షెడ్యూలు ప్రకారమే పరీక్ష