No Ranji Trophy, No IPL: ఐపీఎల్‌(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్‌(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్‌ కిషన్‌... ఐపీఎల్ ఆడేందుకు మాత్రం రెడీ అవుతున్నాడన్న  వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్‌ ఆడని ఇషాన్‌ను తుదిజట్టులోకి ఎలా తీసుకుంటామని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రశ్నిస్తోంది. స్వయంగా రాహుల్‌ ద్రావిడ్‌ కూడా రంజీ ఆడాలంటూ ఇషాన్‌కు సూచించాడు. అయితే ద్రవిడ్‌ మాటలను సైతం పెడచెవిన పెట్టిన ఇషాన్‌.. దేశవాలీ టోర్నీలను కాదని ఐపీఎల్‌ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్‌ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. బీసీసీఐతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో పాల్గొనాలని రూల్‌ పాస్‌ చేశారు.



వీళ్లకే మినహాయింపు!
జాతీయ జట్టు సభ్యులకు, ఎన్‌సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ఈ ప్రకటన పరోక్షంగా తనను ఉద్దేశించే అని గ్రహించిన ఇషాన్‌ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్‌ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రంజీలను పక్కనబెడుతున్న క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్‌తో పాటు వేలంలో కూడా అనర్హత వేటు వేయనున్నట్టు ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. కొంతమంది క్రికెటర్లు ఆడేందుకు ఫిట్‌నెస్‌ ఉన్నా రంజీలను ఆడటం లేదని... ఒకవేళ వాళ్లు జాతీయ జట్టుకు దూరమైతే సయ్యిద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ వంటి టోర్నీలలో టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నారని ఆయన తెలిపారు. ఆ తర్వాత రంజీ సీజన్‌కు వచ్చేసరికి మాత్రం స్టేట్‌ టీమ్స్‌కు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అలాంటివారిని నియంత్రించడానికి బీసీసీఐ త్వరలోనే కొత్త నిబంధనలు తీసుకురాబోతోందని వెల్లడించారు. సీజన్‌లో 3-4 రంజీ మ్యాచ్‌లు అయినా ఆడి ఉండాలని అలా ఆడకుంటే ఐపీఎల్‌లో ఆడనిచ్చేది లేదని... వేలంలో కూడా పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తామని ఆ అధికారి కుండబద్దలు కొట్టాడు.



మానసిక కుంగుబాటేనా.?
గత ఏడాదంతా విరామం లేకుండా జట్టుతో ప్రయాణం చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో ఆడింది మాత్రం చాలా తక్కువ. ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియా తుది జట్టులో కిషన్‌కు పెద్ద అవకాశాలు రావడం లేదు. జట్టులో చోటు దక్కకపోవడంతో ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నాడని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి.