AP government appointed a committee to investigate IPS officer PV Sunil:  పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై విచారణకు అధారిటీని ప్రభుత్వం నియమించింది.   ఆయనపై గతంలో నమోదు అయిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన ఇచ్చిన వివరణను తిరస్కరించిన ప్రభుత్వం  ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలు ఉంటారు.  సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని అధారిటీని ప్రభుత్వం ఆదేశించింది. 



సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ వైఎస్ఆర్‌సీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన చాలా అవకతవకలకు పాల్పడ్డారని .. వైసీపీ అధినేత కోసం టీడీపీ నేతల్ని తప్పుడు కేసులతో వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ కారణంగా ఆయనపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయనకు ఎక్కడా పోస్టింగ్ రాలేదు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన కీలక పాత్ర ధారి అని ఫిర్యాదు దారు, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆరోపిస్తున్నారు. 


ప్రస్తుతం రఘురామ పై కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు అయిన మాజీ ఓఎస్డీ విజయ్ పాల్, కామేపల్లి తులసీబాబు అనే వ్యక్తులు ఇద్దరూ సునీల్ కు సన్నిహితులని చెబుతున్నారు. కామేపల్లి తులసిబాబు సీఐడీకి లీగల్ అడ్వయిజర్ గా..సునీల్ నియమించారని ఆయనను అడ్డం పెట్టుకుని దందాలు చేశారని అంటున్నారు. తనను అరెస్టు చేసిన రోజున సీఐడీ ఆఫీసులో తనపై కూర్చుని.. తనకు ఊపిరి ఆడకుండా చేసి చంపే ప్లాన్ చశారని దానికి పీవీ సునీలే కారణమని రఘురామ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తులసీబాబును అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ కు బాధితులకు అందాల్సిన సొమ్మును పక్కదోవ పట్టించి దోచుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే నివేదిక రెడీ అయినట్లుగా చెబుతున్నారు. 


అలాగే సునీల్ కుమార్ సర్వీసులో ఉంటూనే ఓ మతపరమైన సంస్థను నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన హిందూత్వంపై గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని కొన్ని సంస్థలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. పలుమార్లు కేంద్ర హోంశాఖ నుంచి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి లేఖలు వచ్చాయి. ఓ సారి గట్టిగా హెచ్చరికలు రావడంతో ఆయనను సీఐడీ చీఫ్ పదవి నుంచి బదిరి చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా విచారణకు కమిటీ వేయడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 



Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు