అనంతపురం: ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ పాలనంతా చీకటి జీఓలు, కక్ష సాధింపులకే పరిమితమయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వైజాగ్ లో ఉన్న ఆమె రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఇటీవల తీసుకొచ్చిన చీకటి జీఓలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. 


గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులే 
వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) తీసుకొచ్చిన జీఓలను భోగి మంటల్లో వేసి కాల్చేసిన తరువాత పరిటాల సునీత మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో అనేక జీఓల ద్వారా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కేవలం ప్రజలతో మాత్రమే కాకుండా వారి పక్షాన నిలబడుతున్న ప్రతిపక్షాలను కూడా అణిచివేసేందుకు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జీఓలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ-1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్నోసార్లు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీఓలపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని పరిటాల సునీత విమర్శించారు. 


ఇసుక మీదే 40 వేల కోట్ల దోపిడీ
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక ఇసుక మీదే 40 వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపణలు ఉన్నాయని ఇక మిగిలిన అంశాల మీద ఎంత దోపిడీ జరిగిందో ఊహించలేమన్నారు. కేవలం జగన్ రెడ్డి మాత్రమే కాకుండా.. ఆయన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలుగా మారి దోపిడీ చేశారని విమర్శించారు. రానున్న సంవత్సరంలోనైనా ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని... చీకటిలో మగ్గిపోతున్న తెలుగు ప్రజల జీవితాల్లో ఆనంద వెలుగులు నింపవలసిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పాడి పంటలు, ధాన్యం రాశులు, చక్కని సంస్కృతి, సాంప్రదాయాల మధ్య సంక్రాంతి ఆనందాల్లో మునిగి తేలాల్సిన ఆంధ్రప్రదేశ్ ను సీఎం వైఎస్ జగన్ రెడ్డి రూ.10లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత సైతం వైసీపీకి దక్కుతుందన్నారు.
రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు!
రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి.. గంజాయి, డ్రగ్స్ వంటి వికృత సంస్కృతిని తెచ్చి రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేశాడని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందారని చెప్పారు. ఈ దుర్మార్గాలన్నీ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని... రాష్ట్రాన్ని దుష్టపాలన నుండి విడిపించి... ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు. 2025 సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలంతా సంతోషంగా గడుపుకోవాలంటే... ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు వచ్చే సంక్రాంతి పండుగకు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చంద్రబాబు పని చేస్తారని ఆమె అన్నారు.
Also Read: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ నేతలు, పండుగకు ఏపీకి వచ్చారు: మంత్రి రోజా