GDS Results Latest News: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల 9వ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలకు సంబంధించి 9వ జాబితాలో ఏపీ నుంచి 13 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 28 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. 

ఎంపికైనవారికి ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా సమాచారం అందుతుంది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జనవరి 24లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని ఇండియా పోస్ట్ సూచించింది. ఒరిజినల్ సర్టిఫికేట్లలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల 9వ జాబితాను పోస్టల్ శాఖ తాజాగా విడుదల చేసింది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం ఇస్తారు. 

ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. టీం లీడర్‌గా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవారు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.


ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..