ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో ఉంచారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 2,03,85,851 మంది, పురుష ఓటర్లు 1,98,31,791 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 68,158 మంది, థర్డ్ జెండర్ 3,808 మంది ఉన్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19,79,775 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లున్నట్లు జాబితాలో వెల్లడైంది. ఈ జాబితాను అన్ని జిల్లాల్లోనూ రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా అధికారులకు ఈసీ సూచించింది. దీనిపై అభ్యంతరాలను డిసెంబర్ 9 వరకూ స్వీకరిస్తామని ఈసీ తెలిపింది. ఇంటింటి సర్వే పూర్తయ్యాక 2024, జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తామని పేర్కొంది. 


ఇవీ లెక్కలు


2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్ట్ 30 వరకూ అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునఃపరిశీలన చేసినట్లు తెలిపింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. అలాగే, 1,57,939 ఇళ్లల్లో 10 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదైనట్లు గుర్తించామని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, ప్రత్యేక డ్రైవ్ ద్వారా జీరో డోర్ నెంబర్లలో నమోదైన ఓటర్లను 66,740కు కుదించామని, 10 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లను కూడా తనిఖీ చేసి 71,581కి తగ్గించినట్లు చెప్పారు. 


Also Read: 'జగన్ మళ్లీ సీఎం అయితే చంద్రబాబు చావడం ఖాయం' - వైసీపీ ఎంపీ గోరంట్ల సంచలన వ్యాఖ్యలు