టీడీపీ అధినేత చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని, టీడీపీ అధినేత చంద్రబాబు చావడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం శింగనమలలో శుక్రవారం వైసీపీ సంక్షేమ సాధికార బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్, జనసేనాని పవన్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


గోరంట్ల ఏమన్నారంటే.?


'2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారు. చంద్రబాబు చస్తారు. ఇది గ్యారెంటీ. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, పంచాయితీ నుంచి మొదలుకొని మండలాలు, జడ్పీ, మంత్రివర్గం, డిప్యూటీ సీఎంల వరకూ.. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉండేలా వారికి అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తున్నాం. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.' అని గోరంట్ల వ్యాఖ్యానించారు.


రెండో రోజు సాధికార యాత్ర


వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర రెండోరోజు గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో యాత్ర సాగుతోంది. ఆ పార్టీ శ్రేణులు, నేతలు, అభిమానులు యాత్రలో పాల్గొని బహిరంగ సభల్లో ప్రసంగించారు. 


టీడీపీ నేతల ఆగ్రహం


మరోవైపు, గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ గోరంట్ల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. చంద్రబాబుకు భద్రత పెంచాలని కోరుతున్నారు. 






చంద్రబాబు లేఖ


అటు జైల్లో తన భద్రతపై అనుమానాలున్నాయని, తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తికి లేఖ రాశారు. జైలులో తన ఫోటోలు, వీడియోలు తీసి లీక్ చేస్తున్నారని, వామపక్ష తీవ్రవాదులు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల భద్రతకూ ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నట్లు తెలిపారు. ఈ లేఖను జైలు అధికారులు ఏసీబీ న్యాయమూర్తికి అందజేశారు.


Also Read: కాల్‌డేటా పిటిషన్‌పై 31న తీర్పు - ఏసీబీ కోర్టు నిర్ణయం