Chandrababu Case :   స్కిల్ డెవలప్‌మెంట్  కేసులో సీఐడీ తనను అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ ఉన్న సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు ఇవ్వాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై  తీర్పు 31వ తేదీన ఇస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌పై వాదనలు ముగించారు.  తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ పిటిషన్‌పై గురువారం కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువురిని ఫోన్‌ ద్వారా సంప్రదించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని వాదించారు.                                     


చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకమని ఆయన తరపు న్యవాదాలు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.  చంద్రబాబును విచారణ చేసిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుందని తెలిపారు. దర్యాప్తు అధికారికి తెలియకుండా పోటోలు, వీడియోలు బయటకి రావని.. తమ పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదన్నారు. ఈ కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారుల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని... వారి అరెస్టు అక్రమమని తెలిపారు.                


దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్‌లు , వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకీ లేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటీషన్‌లు వేస్తున్నారని కోర్టులో వాదించారు.   చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేసినట్లు చెప్పారన్నారు. సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్‌ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిందని.. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా సమర్ధించిందని తెలిపారు.                                         


ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్ధమన్నారు. దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అందువల్ల కాల్ డాటా రికార్డు పిటీషన్‌ను కొట్టివేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ఈనెల 31కి రిజర్వ్ చేసింది.