Chandra Grahan 2023 in India Date and Time: ఈ నెల 28న (శనివారం) పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సహా అన్నీ ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని శనివారం (అక్టోబర్ 28) రాత్రి 7:05 గంటలకు మూసేస్తామని అధికారులు తెలిపారు. 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుంచి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. అనంతరం 3:15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వ దర్శనం కల్పిస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకరణ సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామి వారి దర్శన సదుపాయాలను రద్దు చేశారు.
గ్రహణం ఏర్పడిన ప్రతిసారీ గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా, శ్రీవారి ఆలయ తలుపులు మూసేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ శనివారం సాయంత్రం 5 గంటలకు తలుపులు మూసేస్తారు. 


అనుబంధ ఆలయాలు కూడా (Chandra Grahan 2023 Date and Time)


చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోనూ శ్రీ గోవిందరాజ స్వామి, శ్రీ కోదండ రామస్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ శనివారం రాత్రి 7 గంటలకు తలుపులు మూసేస్తారు. గ్రహణం కారణంగా శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయంలో పౌర్ణమి అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాస మంగాపురంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయ్యాయి.


ఏపీలోని ఇతర ఆలయాలు కూడా (Lunar eclipse 2023)


పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఏపీలోని విజయవాడ దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయంతో పాటు ఇతర ఆలయాలన్నింటినీ మూసివేయనున్నారు. శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచ హారతుల సేవ తర్వాత ఆలయ తలుపులు మూసేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి స్నపనాభిషేకం, నిత్యాలంకరణ, పూజల అనంతరం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన రద్దు చేశారు. శ్రీచక్రార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు. 


శ్రీశైలంలోనూ


చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలంలోనూ ఆలయ ద్వారాలు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకూ మూత పడనున్నాయి. అనంతరం ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటల వరకే స్వామి, అమ్మవార్ల సర్వ దర్శనం, మధ్యాహ్నం 12:30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. శనివారం అన్న ప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని, ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తులు గమనించాలని సూచించారు. 


గ్రహణం కారణంగా ఈ ఆలయాలే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలు, ఉపాలయాలు మూతపడనున్నాయి. ఆ సమయంలో భక్తులను దర్శనాలకు అనుమతించరు. కాగా, శనివారం ఏర్పడే చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. నేరుగానే గ్రహణాన్ని చూడొచ్చని నిపుణులు తెలిపారు.


ఆ ఆలయంలో నిఘా వైఫల్యం


ఇదిలా ఉండగా, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు అమ్మవారి గర్భగుడి వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గర్భగుడి వీడియో తీయడం నిషేధం అయినప్పటికీ, సదరు భక్తుడు వీడియో తీయడాన్ని భద్రతా సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.