శాస్త్ర, సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా, ఇంకా కొందరు దెయ్యాలు, క్షుద్ర పూజలు వంటి వాటిని నమ్ముతారు. కొందరిలోని భయం అనే బలహీనతను ఇంకొందరు ఆసరాగా చేసుకుని ఆదాయార్జనగా మార్చుకోవడం మనం చూశాం. ఇంకొందరు ఫేమస్ కావాలనే కొన్ని వందతులు పుట్టించి యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. సరిగ్గా, అలాంటి ఘటనే హైదరాబాద్ పంజాగుట్టలోని కుందన్ బాగ్ లో జరిగింది. ఓ పాడుపడిన భవనంలో దెయ్యాలున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో రాత్రే కాదు పగలు కూడా ఆ వైపు వెళ్లేందుకు స్థానికులు భయపడతారు. ఈ క్రమంలో కొందరు యూట్యూబర్లు వ్యూస్ కోసం ఆ భవనంలో దెయ్యాలున్నాయంటూ వీడియోలు తీసి వదంతులు ప్రచారం చేశారు. దీంతో స్థానికులు భయాందోళకు గురై పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారించిన పోలీసులు 35 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 


ప్రచారంలో ఉన్న కథ 


కుందన్ బాగ్ లోని ఆ ఇంట్లో చాలా కాలం క్రితం ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉండేది. చీకటి పడిన తర్వాత వారు కొవ్వొత్తులను పట్టుకుని ఆ ఇంటి ఆవరణలో నడిచేవారట. వారి ఇంటి ముందు రక్తం నింపి ఉన్న ఓ బాటిల్ కూడా ఉండేదట. దీంతో ఆ చుట్టుపక్కల స్థానికులు వారిని దూరం పెట్టేవారు. ఈ క్రమంలోనే  ఓ దొంగ ఆ ఇంట్లోకి చోరీకి వెళ్లగా కుళ్లిపోయి, గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో తల్లీకూతుళ్లు ముగ్గురూ మృతి చెంది 6 నెలలకు పైగా గడిచినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో ఇన్ని రోజులు తాము చూసింది దెయ్యాల్ని అని భయపడ్డ స్థానికులు, అప్పటి నుంచి ఆ ఇంటి వైపు వెళ్లడమే మానేశారు.  2014లో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి భయానక ప్రచారం నేపథ్యంలో అత్యంత భయానక ప్రదేశాల్లో కుందన్ బాగ్ ఒకటిగా నిలిచింది. 


వ్యూస్ కోసం వదంతులు


ఈ పాడుపడిన భవనంలో దెయ్యాలున్నాయంటూ కొందరు యూట్యూబర్లు ప్రచారం చేశారు. వ్యూస్ కోసం తాజాగా భవనంలో దెయ్యాలు కొవ్వొత్తులు పట్టుకుని తిరుగుతున్నాయంటూ వీడియోలు పోస్ట్ చేశారు. వీటికి మంచి వ్యూస్ రావడంతో ఇంకొందరు బృందాలుగా ఏర్పడి మరీ ఆ బిల్డింగ్ పై వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు యువకులు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో కాలనీవాసుల్లో భయాందోళన నెలకొంది.  దీనిపై వారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భవనం వద్ద పోలీసుల భద్రత ఏర్పాటు చేసి, గడిచిన 3 రోజుల్లో 35 మంది యూట్యూబర్లపై పెట్టీ కేసులు నమోదు చేశారు. 


'వదంతులు నమ్మొద్దు'


ఆ భవనంలో ఎలాంటి దెయ్యాలు లేవని స్థానికులు ఆందోళన చెందవద్దని పోలీసులు స్పష్టం చేశారు. 'కుందన్ బాగ్‌లోని ఒక పాత భవనంపై వస్తున్న వందంతులు ఎవరూ నమ్మొద్దు. పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుందన్ బాగ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది' అని పంజాగుట్ట పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇకనైనా మారండి


యూట్యూబ్ వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్స్ ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. భయం అనే ఎమోషన్ తో ఆడుకుంటూ వాటిపై వీడియోలు చేస్తూ ఫేమస్ కావాలని చూస్తున్నారు. ఇకనైనా ఇలాంటి వారు మారాలని, వదంతులు ప్రచారం చెయ్యొద్దని అక్కడి వారు పేర్కొంటున్నారు. పది మందికి ఉపయోగపడే కంటెంట్ అందించేలా యూట్యూబ్ ఉపయోగించాలని, అంతే కానీ ఇలా అసత్యాలు ప్రచారం చెయ్యొద్దని సూచిస్తున్నారు. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.