సీజన్ మారుతుంది. చలికాలం దాదాపు వచ్చేసింది. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన శరీరం కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. ఆ సమయంలో రోగనిరోధక శక్తి లేకుంటే జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అసలే ఈ ఏడాది ఎండలు అల్లాడించాయి. నవంబర్ నెల దాదాపు వచ్చేసినా.. మధ్యాహ్నవేళ బయటకు వెళ్లాలంటే భయం పుట్టించేలా సూరీడు విజృంభిస్తున్నాడు. కానీ ఉదయం, సాయంత్రం మాత్రం ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చాయి. చలి ప్రారంభమైంది.
వాతావరణంలో మార్పులకు శరీరం తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం. ముఖ్యంగా చలికాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో రోగనిరోధకశక్తి పెంచుకోవడంపై మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే ప్రతి మార్పుతో వైరల్ ఇన్ఫెక్షన్లు చాలా సులువుగా వ్యాపిస్తాయి. అంతేకాకుండా మనలోని రెసిస్టెన్సీ పవర్ కూడా తగ్గుతుంది. తద్వార జలుబు, ఫీవర్ వంటివి ఎటాక్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల.. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండొచ్చు. సీజనల్ వ్యాధులను దూరంగా ఉంచే ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు
పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది. ఇది సీజనల్ వ్యాధులను, అలర్జీలను నిరోధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో ఆరోగ్యకరమైన మసాలా దినుసు అంటారు. ఇది శక్తివంతమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో నిండి ఉండి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
పసుపులోని కర్కుమిన్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. దీనిని ప్రతి వంటలో కలిపి తీసుకోవచ్చు. మెరుగైన ఫలితాల కోసం పాలతో కలిపి రోజూ తీసుకోవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
బ్లాక్ పెప్పర్
మిరియాలు బలమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్లు దరి చేరనీయకుండా దూరంగా ఉంచుతాయి. ఒకవేళ మీరు ఇప్పటికే ఇన్ఫెక్షన్ బారిన పడితే దానిని దూరం చేస్తాయి. సూక్ష్మజీవులు మీ శరీరంలోకి చేరకుండా రక్షిస్తాయి.
అంతేకాకుండా ఇవి సీజన్ మారే వేళల్లో వచ్చే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం అందిస్తాయి. అందుకే చాలామంది ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు మిరియాలతో చేసిన పాలు తాగుతూ ఉంటారు. దీనిలోని పోషకాలు తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి.
కొబ్బరి నీరు..
కొబ్బరినీళ్లల్లో సహజంగానే ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయం చేస్తాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నిండుగా ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధులు రాకుండా శరీరానికి రక్షణగా ఉంటాయి.
కొబ్బరి నీళ్లలో లారిక్ యాసిడ్ కూడా నిండుగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపిస్తుంది. ఒకవేళ సీజనల్ వ్యాధులు ఇప్పటికే ఎటాక్ అయినా.. మీరు కొబ్బరి నీరు తాగడం వల్ల ఇన్ఫెక్షన్ను దూరం చేసుకోవచ్చు. పైగా దీనిలో కెలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవి బరువును సమతుల్యం చేయడంలో సహాయం చేస్తాయి.
సీజనల్ ఫ్రూట్స్
ఏ సీజన్లో అయినా.. ఆ సమయానికి చెందిన ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. అవి సీజన్‌కు అనుగుణంగా సీజన్ ప్రేరిత ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ సమయంలో మీరు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు.
నారింజ, ద్రాక్ష, కివీస్, యాపిల్స్, బ్లూబెర్రీలు హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రుచికరమైన పండ్లు విటమిన్ సి కలిగి ఉండి.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. లోపల నుంచి మిమ్మల్ని బలోపేతం చేస్తాయి. కాబట్టి వాటిని మీరు నేరుగా తినొచ్చు. లేదా ఇంట్లోనే జ్యూస్ చేసుకుని తాగొచ్చు.
స్ప్రౌట్స్
మొలకలు మీ రోగనిరోధక శక్తిని పెంచే అనేక విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, మాంగనీస్, విటమిన్ కె వరకు మీరు చాలా ప్రయోజనాలు వీటి ద్వారా పొందవచ్చు. కాబట్టి వీటిని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తినొచ్చు.
లేదంటే స్ట్రౌట్స్కి టమోటాలు, ఉల్లిపాయలు, కీరదోస వంటి తాజా కూరగాయలను కలిపి కూడా తీసుకోవచ్చు. ఇవి మీకు మరింత పోషకాలు అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ మొత్తం శరీరానికి రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపేస్తాయి.
Also Read : గ్రీన్ టీ తాగండి మంచిదే కానీ.. ఆ సమయంలో మాత్రం వద్దు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.