TDP News : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు, దుర్భిక్ష పరిస్థితులపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిపై టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కళ్లముందే ఎండిపోతున్న పంటలను కాపాడటంలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంపై నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కరవు, రైతు సమస్యలపై నవంబర్ నెలలో తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక రూపకల్పన చేశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్రంలో గత వంద సంవత్సరాల్లో ఇంతటి కరవు పరిస్థితులు చూడలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీరు అందక కళ్లముందే పంటలు ఎండిపోతున్నా జగన్ రెడ్డికి రైతులపై కనీస కనికరం లేదని మండిపడ్డారు. కర్ణాటక రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించడానికి జగన్ రెడ్డే విధానాలే కారణం. కరవు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లే బతుకుదెరువు కోసం అనంత వాసులు కర్ణాటకకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధి లభించి ఉంటే 13 మంది మరణించే వారు కాదు. కరవు భయపెడుతున్నా నివారణ చర్యలపై జగన్ రెడ్డి, వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులకు కనీస స్పృహ లేదు. ఖరీఫ్ లో 40 లక్షల ఎకరాల్లో పంటే వేయలేదని గుర్తు చేశారు. వేసిన పంటల్లో నీరు అందక మూడొంతులు దెబ్బతిన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, కృష్ణా డెల్టా, గోదావరి జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి.
రాయలసీమలో ఎండిపోతున్న వేరుశనగ పంట
రాయలసీమలో 18 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ పంట ఈ ఏడాది కేవలం 7 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అది కూడా ఆ పంటకు సాగునీరు అందక ఎండిపోతున్నాయిని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యానపంటలకు సాగు నీరు అందడం లేదు. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవు నెలకొని ఉంది. పట్టిసీమను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల 40 టీఎంసీల నీరు కోల్పోయాం. ఉద్దేశపూర్వకంగా పట్టిసీమ పంపులకు బూజు పట్టించారు. నీటి నిర్వహణపై జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారు. కరవు ఇంత తీవ్రస్థాయిలో ఉంటే కనీస సమీక్షలు లేవు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వర్షాభావ పరిస్థితుల్లో పొట్టదశలో ఉన్న వరి పంట దెబ్బతింది. సాగునీటి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉందన్నారు.
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి !
జగన్ రెడ్డి వైఖరి కారణంగా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోల్పోతే వ్యవసాయ రంగం తీవ్ర ప్రమాదంలో పడుతుంది. లేఖలతోనే ముఖ్యమంత్రి సరిపెడుతున్నారని టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలివితక్కువ సీఎం, సాగునీటి శాఖ మంత్రి, వ్యవసాయ మంత్రికి కనీస బాధ్యత లేదు. సాగునీటితో పాటు తాగునీటికీ ఎద్దడి ఉంది. రైతులకు ఆరుతడి పంటలకు కూడా నీళ్లివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సంబంధిత ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపక్ష నేతపై విమర్శలు తప్ప రైతుల గురించి పట్టడం లేదు. 679 మండలాలకు గాను 393 మండలాల్లో కరవు ఉంది. కరవు వల్ల కర్ణాటకలో రూ.30వేల కోట్ల నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపగా.. రాష్ట్రంలో కనీసం కరవు మండలాలను ప్రకటించలేదన్నారు.
తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కరవు మండలాలను ప్రకటించాలి. పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
టీడీపీ క్షేత్ర స్థాయి పర్యటనలు
రాష్ట్రవ్యాప్తంగా కరవు, రైతు సమస్యలపై నవంబర్ నెలలో తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రైతులకు భరోసా ఇస్తామని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామన్నారు.