India Mobile Congress 2023:


ఇండియా మొబైల్ కాంగ్రెస్..


ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 7వ ఎడిషన్‌ కార్యక్రమాన్ని ( India Mobile Congress) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లోనే ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. 6G టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండపం కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే హాల్‌లో G20 సదస్సు కూడా జరిగింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ని కూడా కేంద్రం ఇక్కడే నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌ గురించి మాట్లాడారు. ఇంటర్నెట్ వేగంలో ఒకప్పుడు 118వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 43వ స్థానానికి చేరుకుందని గుర్తు చేశారు. 5G టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్‌ సక్సెస్ అయిందని ప్రశంసించారు. కేవలం ఏడాది కాలంలోనే 4 లక్షల 5G బేస్‌ స్టేషన్స్‌ని ఏర్పాటు చేసుకోగలిగామని అన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ చాలా వేగంగా మారుతోందని, అందుకు అనుగుణంగానే మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది ప్రజల జీవన శైలి మార్చే సామర్థ్యం భారత్‌కి ఉందని ధీమా వ్యక్తం చేశారు. టెలీ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపైనా దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. దేశంలోని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో 100 5G ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని మోదీ. టెక్నాలజీలో మార్పులు గతంలోలా ఆలస్యంగా జరగడం లేదని, వెంట వెంటనే మారిపోతున్నాయని అన్నారు. 


"టెక్నాలజీలో రోజూ మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ టెక్నాలజీలోనే భవిష్యత్ ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత్‌ చాలా మెరుగైంది. 5G నెట్‌వర్క్‌ని అందుబాటులోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాం. ఇవాళ దేశవ్యాప్తంగా 4 లక్షల 5G బేస్ స్టేషన్‌లు ఏర్పాటు చేసుకోగలిగాం. టెలికామ్, టెక్నాలజీ, కనెక్టివిటీ ఇలా ఏ సెక్టార్‌లో అయినా భారత్ దూసుకుపోతోంది. 6G, ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్, డ్రోన్స్, అంతరిక్ష రంగం ఇలా ఏ రంగంలో చూసుకున్నా భారత్‌దే హవా. కచ్చితంగా 6G టెక్నాలజీని భారత్‌ లీడ్ చేస్తుందన్న నమ్మకం నాకుంది"


- ప్రధాని నరేంద్ర మోదీ