రైతు బంధు దుబారా అని, అది వేస్ట్ అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రైతులకు మూడు గంటలే కరెంటు కావాలని ప్రస్తుత పీసీసీ చీఫ్ అంటున్నారని విమర్శించారు. పొరపాటున కనుక కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాం రాం, దళిత బంధుకు జై భీం, కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లు అవుతుందని కేసీఆర్ వివరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద నిర్వహించారు. ఈ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తుమ్మల వల్ల బీఆర్ఎస్‌కు అన్యాయం - కేసీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా తొక్కనివ్వబోమని పాలేరులోని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. నాలుగు కాంట్రాక్టులతో డబ్బులు సంపాదించి అహంకారంతో జనాల్ని కొనాలని అంటున్నారని చెప్పారు. ‘‘తుమ్మల నాగేశ్వరరావుకు నేను అన్యాయం చేశానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన ఖమ్మంలో అజయ్ చేతిలోనే ఓడిపోయారు. అయినా సీనియర్ నాయకుడని, ఎమ్మెల్సీ చేశాం, తర్వాత పాలేరులో ఎమ్మెల్యేగా చేయించాం, మంత్రి పదవి ఇచ్చాం. అయినా ఆయన చేసింది గుండు సున్నా. ఖమ్మంలో ఒక్క సీటు లేకుండా చేశాడు. బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? తుమ్మల బీఆర్ఎస్‌కు అన్యాయం చేశాడా? మీరే చెప్పాలి. అడ్డగోలుగా మాట్లాడితే బుద్ది చెప్పాల్సింది మీరే’’ అని కేసీఆర్ చెప్పారు.
‘‘ఉపేందర్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపించుకోండి. మొత్తం నియోజకవర్గానికి దళిత బంధు పెట్టించే బాధ్యత నాది. హుజూరాబాద్ తరహాలో నేనే వచ్చి పథకం ప్రారంభిస్తా’’ అని అన్నారు. గిరిజనులను చులకనగా చేసి మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. నిన్నమొన్నటి దాకా కేసీఆర్ వల్ల మోక్షం వచ్చిందని నేతల నాలుకలు మాట్లాడాయని అన్నారు. ఆ నరం లేని నాలుక కాబట్టి వారు ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నారని అన్నారు. నరం లేని నాలుక మారొచ్చు కానీ సత్యం మారదని.. నిజం నిజం లాగే ఉంటుందని అన్నారు.
ఎంఎస్ స్వామినాథన్ నుంచి ప్రశంసలు
తాను రైతుబంధు పథకానికి శ్రీకారం చుడితే ప్రముఖ వ్యవసాయవేత్త ఎంఎస్ స్వామినాథనే ప్రశంసించారని, శభాష్ చంద్రశేఖర్ బాగా చేశారంటూ కితాబిచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని యూఎన్‌ఓ కూడా భేష్ అన్నదని, తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని కితాబు వచ్చిందని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఇవాళ రైతుల పరిస్థితి తారుమారైందని.. వాళ్ల బ్యాంకు లోన్లు తీరిపోతున్నాయని అన్నారు. లోన్లు తీసుకునే అవసరం లేకుండా పోయిందని.. మునుపటి రోజుల్లో రెండు ఎరువు బస్తాలు కావాలంటే.. అప్పు తీసుకున్న వారికే ధాన్యం పోయడం.. అడిగిన ధరకే ఇవ్వడం ఉండేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం కల్తీ విత్తనాలు అమ్మితే, ఆ అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టి జైళ్లలో పెడుతున్నాం. బ్రహ్మాండమైన పంటలతో ఏకంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండుతుంది. రాబోయే రోజుల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతుంది. ఒకసారి వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ, నీళ్ల పీడ తొలగిపోతుంది’’ అని కేసీఆర్ చెప్పారు.