AP CM YS Jagan Mohan Reddy: రాష్ట్రంలో పెరిగిన జిల్లాల‌కు అనుగుణంగా మెడిక‌ల్ కాలేజీల సంఖ్య‌ను కూడా పెంచాల‌ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. గత నెలలో ఏపీలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేర‌కు కొత్త జిల్లాలకు అనుగుణంగా రాష్ట్రానికి మరో 12 మెడికల్ కాలేజీలు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండ‌వీయ‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ విన్న‌వించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రెండు రోజుల పాటు బిజీగా గ‌డిపిన సీఎం జ‌గ‌న్, న్యాయ స‌ద‌స్సులో పాల్గోన‌టంతో పాటుగా పెరిగిన జిల్లాల‌కు అనుగుణంగా కేటాయింపులు చేయాల‌ని కేంద్రాన్ని కోరారు.


ఢిల్లీలో వైఎస్ జగన్..
ఏపీ సీఎం జ‌గ‌న్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. శ‌ని, ఆదివారాలలో రెండు రోజుల ప‌ర్య‌ట‌నలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాలలో ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అధికారిక కార్య‌క్ర‌మాల‌తో పాటుగా ఏపీలో ప‌రిస్దితులపై కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో జగన్ చ‌ర్చించారు. గ‌తంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండేవని, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను 26కు పెంచామని కేంద్ర ప్ర‌భుత్వానికి సీఎం జగన్ వివ‌రించారు.ఈ మేర‌కు రాష్ట్రానికి జ‌ర‌గాల్సిన కేటాయింపులు కూడా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. 


రాష్ట్ర ప్రజలకు వైద్యం, విద్య ప్రధానమైనవని. కనుక ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో 11 ప్ర‌భుత్వ‌ వైద్య క‌ళాశాలలు ఉన్నాయ‌ని, పాడేరు, మ‌చిలీప‌ట్ట‌ణం, పిడుగురాళ్ళ‌లో మ‌రో మూడు క‌ళ‌శాల‌ల ప‌నులు సాగుతున్నాయ‌ని సీఎం జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ విభ‌జ‌న త‌రువాత రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్దితులు, క‌రోనా వైరస్ వ్యాప్తి వంటి ప‌రిస్దితుల‌ను ఎదుర్కొన్న తీరును జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. 


విభజన తరువాత సమస్యలపై కేంద్రానికి వివరణ.. 
రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆధునిక వైద్య స‌దుపాయాలు ఏపీలో కొర‌త ఉంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యం, అన‌కాప‌ల్లి, కొన‌సీమ‌, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, ఏలూరు, బాప‌ట్ల‌, చిత్తూరు, అన్న‌మయ్య‌, శ్రీ‌ స‌త్య‌సాయి, నంద్యాల జిల్లాల‌కు కొత్త‌గా వైద్య క‌ళాశాల‌లు అవ‌స‌రం ఉంద‌ని కేంద్ర మంత్రికి జ‌గ‌న్ నివేదిక‌ను అందించారు. విభ‌జ‌న అనంతరం ఏపీలో ఆధునిక వసతులతో ప్రభుత్వ ఆసుపత్రులు అంతగాలేవని, రాష్ట్రంలో గుంటూరు, విజ‌య‌వాడ‌, విశాఖ మిన‌హా మ‌రెక్క‌డా చెప్పుకోదగ్గ స్దాయిలో ప్రభుత్వ ఆసుప‌త్రులు లేవని కేంద్రానికి వివరించారు. వైద్య కళాశాలల సమస్యను గుర్తించి ఏపీ స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ విష‌యంలో కేంద్రం స‌హ‌క‌రించాల‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా కోరారు.


Also Read: Nuzvid Mangos: మసకబారుతున్న నూజివీడు మామిడి! మార్కెట్‌కు తగ్గుతున్న పంట - కారణాలు ఏంటంటే


Also Read: Tirumala Boy Kidnap: తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం, ఎత్తుకుపోయిన మహిళ - కెమెరాల్లో రికార్డు